దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం అన్ని వర్గాలవారినీ శోకసంద్రంలో ముంచింది. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు అన్ని వర్గాల ప్రముఖులూ తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హుటాహుటిన హైదరాబాద్ కు వచ్చి, దాసరికి నివాళులు అర్పించారు. ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఎక్కడున్నాసరే, దాసరి అంతిమయాత్రలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దాసరికి నివాళులు అర్పించలేదు. ఆయన ఇంటికి వెళ్లలేదు. ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది.
నిజానికి, దాసరి నారాయణరావు జీవితమంతా హైదరాబాద్ లోనే గడిచింది. ఆయన మూలాలు ఆంధ్రాలో ఉన్నా… సినీ, రాజకీయ జీవితంలో చాలా భాగం ఇక్కడే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యలేదు. కేసీఆర్ ను ఉద్దేశించిగానీ, తెరాసను విమర్శించిన సందర్భాలుగానీ లేవు. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 90 శాతం మంది నిపుణులు ఆంధ్రా నుంచి వచ్చినవారే ఉన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ కూడా వారితో బాగానే ఉంటూ వస్తున్నారు. సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ కు పలువురు సినీరంగ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉంటుందనీ, ఉంచాలని కూడా కేసీఆర్ ఆకాంక్షించిన సందర్భాలున్నాయి.
అలాంటప్పుడు, దాసరికి నివాళులు అర్పించడానికి ఆయన ఎందుకు రాలేదనేది ప్రశ్న? హైదరాబాద్ లోనే ఉండి కూడా ఎందుకు రాలేదనేదే చర్చ! ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాలతో దాసరి అంత్యక్రియలకు ఆదేశాలు ఇచ్చారు. అలా తన పెద్దరికాన్ని చాటుకున్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే దాసరి ఇంటి దగ్గర కనిపించారు. కేసీఆర్ కూడా వచ్చి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడో ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు కూడా దాసరి కుటుంబాన్ని ఓదార్చేందుకు వచ్చారు. నిజానికి, దాసరి కాంగ్రెస్ నాయకుడే అయినా.. ఆ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా చంద్రబాబు స్పందించి, హుటాహుటిన రావడం గమనార్హం. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు స్పందించే తీరు వేరుగా ఉంటుంది. అదే రీతిలో కేసీఆర్ వచ్చి ఉంటే బాగుండేది. పోనీ, కేసీఆర్ వెళ్లకపోవడానికి పెద్దగా కారణాలేవీ లేవనీ ఎందుకో ఆయన ఆసక్తిచూపలేదని మాత్రమే తెలుస్తోంది.