తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు వరదకు కకావికలం అయినా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌజ్ వీడి బయటకు రాకపోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలు కూడా ఇదే విషయమై ప్రశ్నిస్తోన్నా కేసీఆర్ మాత్రం తనకేం పట్టనట్లే ఉన్నారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగేందుకు సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కవితకు బెయిల్ దక్కిన తర్వాత కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి వస్తారని ప్రచారం జరిగింది. కాని, కవితకు బెయిల్ లభించి వారం రోజులు అవుతున్నా..ఆయన మాత్రం ఫామ్ హౌజ్ ను వీడి బయటకు రావడం లేదు.. అయితే, వినాయక చవితి ఉత్సవాలు ముగిసిన తర్వాతే కేసీఆర్ జనంలోకి వస్తారని అంటున్నారు. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణం, ఆ పార్టీ బలం, బలహీనతలను తెలుసుకునేందుకు కేటీఆర్ సారధ్యంలో త్వరలోనే ఓ బృందం వెళ్లనుంది. ఆ స్టడీ టూర్ తర్వాత వీటిపై చర్చించి బీఆర్ఎస్ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన అనంతరం , గ్రౌండ్ లోకి దిగుతారు అనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు పూర్తిగా రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతుండటంతో.. రైతు అంశాలే ఎజెండాగా కేసీఆర్ రాజకీయం చేస్తారని అంటున్నారు. అదే సమయంలో రైతు బంధు స్థానంలో అమలు చేస్తామని చెప్పిన రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారు? ఎవరెవరికి ఇస్తారు..? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా గైడ్ లైన్స్ విడుదల చేయకపోవడంతో …వీటిని అస్త్రాలుగా మలుచుకొని కాంగ్రెస్ సర్కార్ పై కేసీఆర్ సమరభేరి మోగిస్తారని బీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.