బిజెపి శాసనసభా పక్ష నాయకుడు కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందుతారని కొంతమంది నాయకులు చెప్పడమే కాదు, మీడియా కూడా కథనాలు ఇచ్చింది. నిజానికి ఆ అవకాశమే లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఎంపి కారు. వెంకయ్య నాయుడులా మరో చోట నుంచి పంపడం అంత సులభమూ కాదు. మరెందుకు ఈ ప్రచారమంటే రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి సామాజిక కోణంలో కొందరు కావాలనే ప్రచారం చేశారట. రెండవది- స్వయానా కిషన్‌రెడ్డికి ఒక అసంతృప్తి వుందట. ఎప్పుడో భారతీయ జనతా యువమోర్చా అద్యక్షుడుగా ఆయన పనిచేశారు. అప్పటికి పార్టీలో గాని పార్టీ విభాగాల్లో గాని ప్రధాన బాధ్యత నిర్వహించిన తెలుగు వ్యక్తి ఆయనేనట. అప్పుడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తనతో పాటు పనిచేసిన వారే గాక సహాయకులుగా వున్న వారు కూడా కేంద్రంలో కీలకమైన మంత్రి పదవుల్లోకి వచ్చేశారు. ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయెల్ ఇత్యాదులు. అంతెందుకు? ప్రధాని నరేంద్రమోడీ తనతో కలసి అమెరికాలో యువనేతల శిక్షణా కార్యక్రమానికి వచ్చారంటూ అప్పటి పోటోలు తరచూ అప్లోడ్ చేస్తుంటారు. ఆ రేంజిలో వుండిన తాను ఇప్పుడు రాష్ట్ర స్థాయికే పరిమితమై పోవడం అక్కడ కూడా లక్ష్మణ్ అద్యక్షుడుగా రావడం కొంచెం ఇబ్బంది పడుతున్నారట. లక్ష్మణ్ నాయకత్వం రాగానే కిషన్ ఢిల్లీ వెళతారని అనుయాయులు ప్రచారం చేశారు గాని జరగలేదు.ఇప్పుడు బండారు దత్తాత్రేయ స్థానంలో తనను తీసుకుంటారని మరో కథనం వినిపిస్తూ వచ్చారు. వెదిరె శ్రీరాంకు మురళీధర రావుకు అవకాశమున్నట్టు వార్తలు రావడం వీరికి మింగుడు పడలేదు. చివరకు ఎవరికీ రాకపోవడంతో కొంత వూపిరి పీల్చుకున్నారు. అయితే కిషన్‌రెడ్డిని సంతృప్తిపర్చేందుకు అధిష్టానం అంటే అమిత్ షా ఏమైనా చేస్తారా అంటే అదీ జరిగేట్టు అగుపించడం లేదు. ఇదంతా బిజెపిలో పండిపోయిన సీనియర్ నాయకులు, నూతన నేతలూ కూడా చెబుతున్న మాట. కాంగ్రెస్‌లో రెడ్డి వర్సెస్ వాదనలు బాహాటంగా వినిపిస్తుంటే బిజెపిలో లోలోపల మల్లగుల్లాలు పడుతున్నారంతే.