ఉప ఎన్నిక అయిపోయింది! ఫలితాలు కూడా మరో మూడు రోజుల్లో వస్తాయి. అంతా సద్దు మణిగింది అనుకుంటే… పరిస్థితి రోజుకో రకంగా మారుతోంది! నంద్యాల ఉప ఎన్నిక జరిగిపోయిన తరువాత కూడా అధికార ప్రతిపక్షాలు ఇంకా ఇగోలకు పోతున్నాయి. ఎన్నికల ముందు వరకూ మాటల దాడికి మాత్రమే పరిమితమౌతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా రాళ్ల దాడులు, తుపాలతో గాల్లో కాల్పులు, తోపులాటలు వంటివి చోటుచేసుకున్నాయి. నంద్యాలలో శిల్పా, భూమా వర్గాల మధ్య గొడవ జరిగింది. నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ఒక మైనారిటీ నాయకుడు అంత్యక్రియలకు కోసం వైకాపా నేత శిల్పా చక్రపాణి రెడ్డి వచ్చారనీ, ఇదే అదనుగా ఆయనపై భూమా వర్గానికి చెందిన మధు అనే నాయకుడు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని కథనం!
చక్రపాణి రెడ్డిపై దాడిని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పుల ఘటన జరిగిందంటూ వైకాపా ఆరోపిస్తోంది. మధు కారు మీద ముందుగా వైకాపా వ్యక్తులే దాడికి దిగారనీ, అందుకే రక్షణలో భాగంగా గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారంటూ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. శిల్పా వర్గం వైకాపాలో చేరిన దగ్గర నుంచీ తన ప్రాణాలకు ముప్పు ఉందన్న భయంతోనే గన్ మెన్ రక్షణ కోసం అప్లై చేసుకున్నానని మధు అంటున్నారు. అయితే, ఈ దాడికి కారణం పాత కక్షలే అని కొంతమంది అంటున్నారు. వైకాపా వర్గమే దురుసుగా ప్రవర్తిస్తోందనీ, ఘటనకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయనీ, దీన్లో ఎవరి కారు పగిలిందో ప్రజలే చూశారంటూ ఈ ఘటనపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఇక, వైకాపా నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవైపోయాయనీ, తెలుగుదేశం నేతలు దాడులకు దిగుతున్నారంటూ విమర్శించారు.
నంద్యాలలో ఈ పరిస్థితి కారణం టీడీపీ అని వైకాపా… కాదు, వైకాపా అని టీడీపీ ఇప్పుడు సిగపట్లకు దిగుతున్నాయి. నిజానికి, ఈ ఘటనే కాదు… నంద్యాల వాతావరణాన్ని వేడెక్కించడంలో ఇరు పార్టీలదీ తిలాపాపం తలా పిడికెడు! ఒక ఉప ఎన్నికను, సాధారణ ఉప ఎన్నికలా జరగనీయకుండా… దానికి రాష్ట్ర స్థాయి ప్రాధాన్యత ఆపాదించింది ఎవరు..? ఇదేదో మహా కురుక్షేత్రానికి మచ్చుతునక, రాష్ట్ర ప్రజల అభిమతానికి అద్దం అంటూ ప్రజల్లో అనవసర భావోద్వేగాలను పెంచింది ఎవరు..? నంద్యాలలో ఓటమి లేదా గెలుపు అనేవి అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్చేసింది ఎవరు..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఒకటే జవాబు.. అధికార, ప్రతిపక్షాలు. నంద్యాల ఉప ఎన్నికను అవసరానికి మించిన ఓ ఎమోషనల్ వ్యవహారంగా ప్రజలపై రుద్దేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత జగన్ లు కూడా అక్కడే రోజుల తరబడి తిష్టవేసి… పార్టీ కేడర్లలో స్ఫూర్తి పేరుతో నింపాల్సినవన్నీ నింపేసి, వాళ్లు వెళ్లిపోయారు. అవి అంత వేగంగా చల్లారేవా..? చేసిందంతా చేసేసి, ఇది చాలదన్నట్టుగా… ఇప్పుడేమో మీ వాళ్లే మామీద రాళ్లేశారు, వీళ్లే రప్పలేశారంటూ ప్రెస్ మీట్లు పెట్టడం..! ఉప ఎన్నిక జరిగిపోయినా కూడా పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా ఉందంటే కారణం ముమ్మాటికీ ఈ రాజకీయ పార్టీలదే. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ఎన్నికల ఫలితాల రోజున పరిస్థితి ఏంటో…?