పటాస్‌తో మాస్ దర్శకుడిగా తనని తాను నిరూపించుకొన్నాడు అనిల్ రావిపూడి. సుప్రీమ్ తోనూ హిట్ కొట్టాడు. ఇప్పుడు రాజా ది గ్రేట్ తో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దమయ్యాడు. అయితే రవితేజ కంటే ముందు ఈ కథని… ఎన్టీఆర్, రామ్‌లకు వినిపించాడు అనిల్ రావిపూడి. రామ్‌తో అయితే దాదాపుగా ఓకే అయిపోయిందనుకొన్నారు. కానీ అనుకోని కారణాల వల్ల.. సడన్‌గా ఆగిపోయింది. ఆ తరవాత రవితేజతో ప్రొసీడ్ అయ్యాడు. ఈ కథ ఎన్టీఆర్ కీ నచ్చింది. కాకపోతే.. వర్కవుట్ అవ్వలేదు. దానికి గల కారణం బయటపెట్టాడు అనిల్ రావిపూడి. ”ఎన్టీఆర్‌కి ఈ లైన్ బాగా నచ్చింది. ఆయనతో నెల రోజుల పాటు ట్రావెల్ చేశా. కానీ.. ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ తయారు చేయలేకపోయా. ఎన్టీఆర్ మరో సినిమా అర్జెంటుగా చేయాల్సివచ్చింది. ఆయన అనుకొన్న సమయానికి నా స్క్రిప్టు పూర్తి కాలేదు. సగం కథ చూసి ఎవ్వరూ అవకాశం ఇవ్వలేరు కదా? అందుకే ఎన్టీఆర్‌తో పనిచేసే ఛాన్స్ మిస్సయ్యింది” అన్నాడు అనిల్ రావిపూడి. అయితే ఎప్పటికైనా ఎన్టీఆర్ తో మాత్రం సినిమా తీస్తా అంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.
”ఎప్పటికైనా ఎన్టీఆర్‌తో సినిమా చేస్తా. ఆయన రేపు రమ్మంటే.. రేపే కథ చెబుతా. ఆయన అడగాలే గానీ, వంద కథలున్నాయి. ఆయన ఒప్పుకొనే వరకూ ఏదో కథ చెబుతూనే ఉంటా” అంటున్నాడు. ‘రాజా ది గ్రేట్’పై పాజిటీవ్ టాకే నడుస్తోంది. ఈ సినిమా కూడా వర్కవుట్ అయిపోతే.. అనిల్ రావిపూడి స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోతాడు. అప్పుడు కచ్చితంగా ఎన్టీఆర్ నుంచి పిలుపొస్తుందేమో..? ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వదలేట్టు లేడు అనిల్ రావిపూడి.