రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్… ఈ మూడు రాష్ట్రాల్లో భాజపా అధికారం కోల్పోయింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో భాజపాకి అంతకుమించి అనూహ్య ఆదరణ దక్కదు. ఇక, పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపి… ఈసారి భాజపాకి ఛాన్స్ ఇవ్వకుండా చేసే ప్రయత్నంలో ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్… ఈ రాష్ట్రాల్లో భాజపాకి కష్టకాలమే కనిపిస్తోంది. సో.. ఓవరాల్ గా మోడీ హవా బలహీనపడే వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో… ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని హఠాత్తుగా తెరమీదికి తెచ్చారు. కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఈ బిల్లును తెరమీదికి తెచ్చారన్నది సుస్పష్టం.
ఒకవేళ మోడీ సర్కారుకు నిజంగా ఓబీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధే ఉంటే… గడచిన నాలుగున్నరేళ్లూ ఏం చేసినట్టు..? ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఈ ప్రేమ ఎందుకు కలిగినట్టు..? ఇంకోటి.. ఇప్పుడైనా సరే, అన్ని రాష్ట్రాలనూ పిలిచి, దీనిపై ముందుగా రాజకీయ ఏకాభిప్రాయం తెచ్చే ప్రయత్నమూ చెయ్యలేదు! నిజానికి, రాజకీయ పార్టీలతో చర్చించినా.. దీన్ని ఎవ్వరూ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చే అవకాశం లేదు. సవరణలు మినహా ఎవ్వరూ దీన్ని కాదనరు. కానీ, ఆ పని ముందుచేస్తే… మోడీ సర్కారుకి దక్కే క్రెటిడ్ లో భాగం తగ్గుతుందేమో కదా! అందుకే, అనూహ్యంగా ఈ బిల్లు తీసుకొచ్చేసి.. అగ్రవర్ణాలపై అపారమైన ప్రేమ తమకే ఉందని చాటుకుని ఓట్లు రాబట్టే ప్రయత్నం ఇది.
అంతేకాదు, ఈ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. జేపీసీ అంటూ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఏవైనా కారణాలతో రాజ్యసభలో ఈ బిల్లు ముందుకు సాగకపోయినా… అప్పుడూ రాజకీయ లబ్ధికి భాజపా ప్రయత్నిస్తుంది! ఎలా అంటే… మేం మంచి ఉద్దేశంతోనే బిల్లును తీసుకొస్తే, విపక్షాలు అడ్డుకున్నాయంటూ ప్రచారం చేసుకుంటుంది. అంతేకాదు, ఈ బిల్లు లోక్ సభలో ముందుగా ప్రవేశపెట్టారు కాబట్టి… ఎన్నికలొచ్చాయంటే దీన్ని పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి. ఆ తరువాత, కొత్తగా వచ్చే ప్రభుత్వం మళ్లీ మరోసారి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా, దీన్ని ఎన్నికల్లో భాజపా బాగా వాడుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ బిల్లును ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా ప్రవేశపెట్టడం వెనక ఉన్న మోడీ సర్కారు రాజకీయ లబ్ధి ఉద్దేశాన్ని అగ్రవర్ణాలు కచ్చితంగా గుర్తిస్తాయి.