వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తే.. జనసేన అధినేత వపన్ కల్యాణ్‌కు ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ విషయం చాలా సందర్భాల్లో వెల్లడయింది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడే తన వ్యక్తిగత జీవితం, వివాహాల విషయంలో వచ్చిన విమర్శలకు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగతంగా వెళ్లాలనుకుంటే.. తానూ వ్యక్తిగతంగా వెళ్తానని ప్రతి ఒక్కరి జీవితాలను రోడ్డు మీద పెడతానంటూ ఆవేశంగా చెప్పారు. తన నుంచి విడిపోయిన మహిళలు.. ఎవరి జీవితాలు వారు బతుకుతున్నారని.. అనవసరంగా వారి జోలికెందుకెళ్తారని కూడా ప్రశ్నించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి.. ఇంత వరకూ ఏ రాజకీయ నేత చేయనన్ని ఘాటు విమర్శలు పవన్‌పై చేశారు. తను చేసుకున్న వివాహాల సంఖ్యను కావాలనే అధికంగా చూపి.. ప్రజల్లో కొత్త చర్చ జరిగేలా చేశారు. ఇది సహజంగా పవన్ కల్యాణ్‌కు ఆగ్రహం తెప్పించకుండా ఉండదు.
జగన్ విమర్శలపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారన్నదానిపై.. జనసేన వర్గాలు కూడా ఉత్కంఠగా ఉన్నాయి. నిన్న అభిమానుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంమలోనే కాలు బెణికింది. ఆ బాధలో ఉండగానే.. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. వీటిని పవన్ కల్యాణ్ తన పార్టీ నేతల ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత వీడియోలు కూడా చూశారు. ఎలా స్పందించాలన్నదానిపై..ఆయనకు ఆయనే ఆలోచించుకుటున్నారు. సహజంగా.. పవన్ కల్యాణ్‌కు కూడా ఇతరుల దగ్గర సలహాలు తీసుకునే అలవాటు లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
జగన్ విమర్శలపై స్పందించకపోతే…ఓ బాధ… స్పందిస్తే.. మరో ఇబ్బంది పవన్ కల్యాణ్‌కు ఎదురవుతుంది. జగన్ విమర్శలపై స్పందించాలంటే… వారిపై మరిన్ని ఆరోపణలు చేయాలి. ఇలా చేయడం వల్ల.. ఎదుటి పక్షం కూడా కచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఇలా ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే… ఆ వివాదం పెద్దదై.. వ్యక్తిగత జీవితాలు మరింతగా రచ్చ అవుతాయి తప్ప ప్రయోజనం ఉండదు. అదే సమయంలో ఏమీ స్పందించకుండా ఉంటే.. మౌనం అర్థాంగీకారం అన్నట్లుగా.. వైసీపీ సోషల్ మీడియా చెలరేగిపోతుంది. అందుకే ఇప్పుడు పవన్ డైలమాలో ఉన్నారు.
కానీ పవన్ కల్యాణ్‌కు టెంపర్ చాలా ఎక్కువ. రేపు పోరాటయాత్రలో.. మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. జగన్ ప్రస్తావన వస్తే.. మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకోలేరు. కచ్చితంగా మాటకు మాట అంటారు. ఇదే జనసేన వర్గాలను కూడా ఆందోళన పరుస్తోంది. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలన్నదే జనసేన విధానమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు జగన్ పై పవన్ కల్యాణ్ స్పందనను ఆ విధానంకి ఇచ్చే ప్రాధాన్యతను జనసేన వర్గాలు నిర్ణయించుకోవచ్చు.