చాలారోజుల తరువాత ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదిక పూర్తిచేయాలనే డిమాండ్ వినిపించారు. అంతేకాదు, ఇదే డిమాండ్ తో పాదయాత్రకు ఆయన సిద్ధమౌతున్నట్టు ప్రకటించారు. జనవరి 7 నుంచి రెండు రోజులపాటు పాదయాత్ర చేస్తానన్నారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి తన యాత్ర మొదలౌతుందనీ, 10వ తేదీన పోలవరంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం చేపడతానని చెప్పారు. ఈ యాత్రకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం కోసం రాజమహేంద్రవరంలో ఆయన నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంటూ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపాలని రఘువీరా ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు.
అయితే, ఉన్నట్టుండి రఘువీరా ఈ కార్యక్రమం ఇప్పుడే ఎందుకు మొదలుపెట్టినట్టు..? ప్రతిపక్ష పార్టీ వైకాపా నేతలు ఆ మధ్య పోలవరం సందర్శించారు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వెళ్లారు. అంతకుముందు అధికార పార్టీవారు కూడా ప్రాజెక్టుకు వెళ్లొచ్చారు. ఇప్పుడు రఘువీరా చేపట్టిన ఈ పాదయాత్ర కార్యక్రమం అప్పుడే ప్రకటించి ఉంటే కొంత ప్రాధాన్యత ఉండేది. పోనీ, ఈ మధ్య కేంద్రం కొర్రీల నేపథ్యంలో పోలవరంపై పెద్ద చర్చే జరిగింది. కనీసం ఆ సందర్భంలో అయినా రఘువీరా ఈ యాత్ర మొదలుపెట్టినా కొంత గుర్తింపునకు ఆస్కారం ఉండేది. కానీ, అంతా సద్దుమణిగిన తరువాత ఇప్పుడే ఈ కార్యక్రమంతో రఘువీరా ఎందుకు సిద్ధమౌతున్నట్టు..? అంటే, దీని వెనక రాజకీయ ప్రయోజనమే కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. దీనికి కారణంగా ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను చెప్పొచ్చు.
గతవారంలో ఢిల్లీలో వార్ రూమ్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో ఏపీకి చెందిన కొంతమంది నేతలు పార్టీ పరిస్థితిపై ఆశావహమైన ప్రకటనలు చేశారు. త్వరలోనే కొన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను మార్చాలన్న ఉద్దేశంలో రాహుల్ ఉన్నారనే అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమైంది. దీంతో రఘువీరా మార్పు తప్పదనే ప్రచారం మరోసారి ఏపీ శ్రేణుల్లో ఊపందుకుంది. అయితే, పార్టీ కోసం శ్రమించేవారికే గుర్తింపు ఉంటుందని రాహుల్ అంటున్నారు కదా! కాబట్టి, ఆ కోణం నుంచి రఘువీరాకి కొన్ని ఆశలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అందుకే, ఇప్పట్నుంచీ కొంత యాక్టివ్ అయిపోయి, పార్టీ తరఫున ఇలాంటి యాత్రలు, సభలు వంటివి నిర్వహించడం ద్వారా తన పదవిని మరోసారి నిలుపుకోవచ్చనే వ్యూహంలో ఆయన ఉన్నారని కొందరు అంటున్నారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉండి.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై పోరాటం అంటూ గతంలోని లేని చురుకుదనం ఆయనలో కనిపించేసరికి అలాంటి అభిప్రాయాలకు కొంత బలం చేకూరుతున్నట్టుగా అనిపిస్తోంది.