హైదరాబాద్: గత నెల 31న రష్యా విమానం ఈజిప్ట్‌లో పేలిపోయి 224 మంది చనిపోయిన దుర్ఘటన వెనక కారణాన్ని రష్యన్ పోలీసులు ఎట్టకేలకు నిర్ధారించారు. ఇది ఉగ్రవాద దాడేనని తేల్చారు. విమాన శకలాలను పరీక్షించగా పేలుడు పదార్థాల అవశేషాలు లభించినట్లు తెలిపారు. ఒక కిలో టీఎన్టీ పేలుడు పదార్ధాన్ని తీవ్రవాదులు విమానంలో పెట్టినట్లు వెల్లడించారు.ఈ దాడి చేసినవారు భూమిమీద ఎక్కడున్నా పట్టుకుని శిక్షించి తీరుతామని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. దాడి చేసినవారి ఆచూకీ చెప్పినవారికి రష్యా ప్రభుత్వం 50 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించింది.
ఈ దాడి తమ పనేనని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పేలుడు జరిగిన రోజే ప్రకటించారు. మిస్సైల్ సహాయంతో విమానాన్ని కూల్చామని చెబుతూ, దానికి ఆధారంగా ఓ వీడియోనుకూడా రిలీజ్ చేశారు. అయితే రష్యా నాడు ఆ వాదనను కొట్టిపారేసింది. ఎర్రసముద్రంలోని ఒక రిసార్ట్నుంచి రష్యా వెళుతుండగా ఈ విమానం పేలిపోయి సినాయ్ అనే ఈజిప్ట్ ఎడారిలో కూలిపడింది. చనిపోయినవారిలో ఎక్కువమంది రష్యన్లే.