నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి కూడా పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు, చక్రపాణి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షం వైసీపీ తరఫున నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకున్నదీ చూశాం. అయితే, అన్నయ్య మోహన్ రెడ్డి వైపీసీలో చేరిన తరువాత, ఇన్నాళ్లూ మౌనంగా ఉంటూ వచ్చిన చక్రపాణి కూడా ఇప్పుడు టీడీపీ నుంచి బయటకి వచ్చేస్తున్నారు. ఈ తరుణంలో పార్టీ ఎందుకు మారుతున్నారో కారణాలు చెప్పాలి కదా! అందుకే, శిల్పా మోహన్ రెడ్డి చెప్పిన రొటీన్ కారణాన్నే చక్రపాణి కూడా చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో ఉండగా తనకు అవమానకరమైన పరిస్థితులు కల్పించారనీ, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చక్రపాణి ఆరోపించారు. పార్టీకి రెండేళ్లపాటు అధ్యక్షునిగా పని చేశాననీ, ప్రతీ గ్రామంలోనూ ప్రతీ మండలంలోనూ తాను పర్యటించి, పార్టీ బలోపేతం చేసేందుకు చాలా కృషి చేశానని చెప్పుకున్నారు. నిజం చెప్పాలంటే జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోశాను అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతల నుంచే సరైన సహకారం అందలేదనీ, అయినాసరే తానే ఎంతో కష్టపడ్డానని చక్రపాణి చెప్పుకొచ్చారు. సోదరులిద్దరమూ చీమకు కూడా అపకారం చేయని మనస్తత్వం ఉన్నవారమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తనను పక్కన పెట్టిన సందర్భాలున్నాయనీ, నంద్యాలకు వచ్చినప్పుడు తనను పట్టించుకోకుండా ఇతర నేతలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. పార్టీ మారడానికి కారణం తనకు ఎదురైన అవమానకర పరిస్థితులే అని చక్రపాణి తేల్చి చెప్పారు!
సరిగ్గా, ఇవే మాటల్ని శిల్పా మోహన్ రెడ్డి కూడా చెప్పారు. టీడీపీలో ఎదురైన అవమానాలే వైసీపీలో చేరేందుకు కారణాలుగా చూపించారు. నిజమే.. టీడీపీలో శిల్పా సోదరులకు అవమానాలే ఎదురయ్యాయన్న వాస్తవమే కావొచ్చు. అయితే, ఎప్పుడు అవమానం అని అనిపిస్తే అప్పుడే స్పందించాలి కదా! ఆ వెంటనే పార్టీ నుంచి బయటకి వచ్చేయాలి కదా! అంతేగానీ, నంద్యాల ఉప ఎన్నిక సమీపించేంత వరకూ వేచి ఉండి, ప్రతిపక్ష పార్టీ నుంచి టిక్కెట్ ఆఫర్ వచ్చేంత వరకూ ఎదురుచూసిన తీరును ప్రజలు అర్థం చేసుకోలేరా..? ఎప్పుడో అవమానం జరిగితే… ఆ నొప్పి ఇప్పుడే గుర్తించినట్టు చక్రపాణి మాట్లాడుతూ ఉండటం విశేషం. సొంత ప్రయోజనాలు లేకుండా ఏ నాయకుడూ పార్టీ మారడు అనేది ప్రజలకు తెలుసు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట చెప్పారు! వైసీపీలో అవమానంతోనే బయటకి వచ్చామనీ, టీడీపీలో చేరామన్నారు.
ఈ లెక్కన నాయకులందరూ కేవలం ‘అవమాన’ భారంతోనే పార్టీలు మారుతున్నట్టు లెక్క. విచిత్రం ఏంటంటే.. జరిగిన అవమానాన్ని కొన్నాళ్లపాటు దిగమింగుకుంటూ… తమకు అవసరం వచ్చినప్పుడు, చేరాలనుకుంటున్న పార్టీ నుంచి మంచి ఆఫర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ నొప్పిని నేతలు గుర్తిస్తుండటం! అవమాన భారాన్ని అమాంతంగా ప్రజలకు ముందు పెట్టేయడం! మొత్తానికి, పార్టీ మారిన నేతలందరూ ‘అవమానం’ అనేదాన్ని బాగానే వాడుకుంటున్నారు.