నంద్యాల ఉప ఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ ఆశించి, తరువాత వైకాపాలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు శిల్పా మోహన్ రెడ్డి. భూమా అఖిల ప్రియ వర్గం నుంచి బ్రహ్మానంద రెడ్డికి టిక్కెట్ దక్కింది. ఇక, ఈ ఎన్నికల్లో ఖర్చు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు! రెండు పార్టీలూ పట్టుదలతో ఉన్నాయి కాబట్టి.. ఖర్చు విషయంలో ఎవ్వరూ వెనక్కి తగ్గే పరిస్థితి దాదాపు ఉండదనే చెప్పాలి. అయితే, తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి… ఖర్చుతోపాటు ఇతర విషయాల్లో ఆ పార్టీకి కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ విషయం విపక్ష నేత జగన్ కు ముందే తెలుసు కాబట్టే.. ఏరికోరి శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారని కథనం!
నిజానికి, నంద్యాల ఉప ఎన్నికలో వైకాపా సీటు కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నమే చేశారు. భూమా నాగిరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్న దగ్గర్నుంచీ వైకాపా బాధ్యతలన్నీ ఆయనే చూసుకుంటూ ఉన్నారు కాబట్టి, తనకు టిక్కెట్ ఖాయమని అనుకున్నారు. ఇక, గంగుల వర్గం కూడా వైకాపా టిక్కెట్ ఆశించింది. కానీ, ఈ ఇద్దర్నీ కాదని… చివర్లో వచ్చిన శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం వెనక ఓ ఒప్పందం ఉందని తెలుస్తోంది! తనకు టిక్కెట్ ఇస్తే నంద్యాల ఎన్నికలకు కావాల్సిన ఖర్చంతా సొంతంగా భరించుకుంటాననీ, పార్టీ నుంచీ ఒక్క రూపాయి కూడా ఆశించనని శిల్పా ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. ఎలాగూ ప్రస్తుత పరిస్థితుల్లో భారీ ఖర్చులు పెట్టే పరిస్థితిలో పార్టీ లేదనీ, శిల్పాకు టిక్కెట్ ఇస్తే స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా అవుతుందని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. జగన్, శిల్పాల మధ్య ఉప ఎన్నికల ఖర్చువెచ్చాల సంగతే ప్రధానంగా చర్చకు వచ్చిందనీ, ఆ తరువాతే శిల్పాకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టిక్కెట్ ఇస్తే చాలనీ, ఉప ఎన్నికలో గెలిచి వస్తానని కూడా జగన్ కు శిల్పా హామీ ఇచ్చారట!
వైకాపా టిక్కెట్ ఆశించి గంగుల వర్గం, రాజగోపాల్ రెడ్డి వర్గాలకు కూడా ఇదే విషయం చెప్పి అసంతృప్తికి గురికాకుండా తగ్గించి ఉంటారని అనుకుంటున్నారు! ఉప ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందనీ, శిల్పాకి అవకాశం ఇస్తే ఆ ఖర్చేదో ఆయనే పెట్టుకుంటారనీ, దాని వల్ల పార్టీకి మేలు జరుగుతుందని ఈ రెండు వర్గాలను కన్వెన్స్ చేసే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. సో.. ఓవరాల్ గా అర్థమౌతున్నది ఏంటంటే.. నంద్యాల ఉప ఎన్నికల్లో ఖర్చులు భారీగా ఉండబోతున్నాయన్నమాట! ప్రతిపక్షమే ఇంత వ్యూహాత్మకంగా ఖర్చు విషయంలో ఉంటే, ఇక అధికార పార్టీ ఏ స్థాయిలో ఉంటుందో! పైగా, ఖర్చుతోపాటు ఇతర ఎన్నో అంశాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయనడంలో సందేహం లేదు.