‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డి’ టైటిల్ కాస్త ‘సైరా – నరసింహారెడ్డి’గా మారిపోయింది. మొదట్లో సై రా అంటే ఏమిటో ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ‘సై..’ ‘రా’ అంటూ ప్రత్యర్థిని కవ్వించే గుణం ఉన్న వీరుడు కాబట్టి.. ఈ పేరు సెట్ చేశారా? లేదంటే మాస్‌కి చేరువ అవ్వడానికి కమర్షియల్‌గా ఆలోచించారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే రాయలసీమలో ఉయ్యాల వాడ నరసింహారెడ్డిపై జనపదులు ఓ గీతాన్ని పాడుకొంటారు. ఆ పాట ‘సైరా’ అనే పదంతో ప్రారంభం అవుతుంది. రాయలసీమలో ఈ పాట చాలా పాపులర్. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్పదనం కీర్తిస్తూ పాడే ఈ పాటలోని తొలి పదాన్నే.. టైటిల్‌గా పెట్టడంతో రాయలసీమ వాసుల మనసుల్ని గెలుచుకొనే ప్రయత్నం చేసింది చిత్రబృందం. అయితే.. అన్ని భాషల్లోనూ ఇదే టైటిల్‌తో విడుదల చేస్తారా? తమిళ, హిందీ కోసం టైటిల్ మారుస్తారా?? అనేది తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాలి.
అన్నట్టు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పై రాయలసీమ వాసులు పాడుకొనే పాట ఇదిగో… ఇదే..
”సైరా నరసింహారెడ్డి
నీ పేరే బంగార్పూకడ్డీ
రాజారావు తావుబహద్దరు నారసింహారెడ్డి
రెడ్డి కాదు బంగార్పుకడ్డి నారసింహారెడ్డి
ముల్ కోల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికీ మొనగాడు
రెడ్డి మాటలు ఏదాలురా రాండి సూరులారా (సైరా)
మొనగాండ్రకు రేనాటి గడ్డరా – రోషగాండ్రకు పెద్ద పేరురా
దానధర్మములు దండిగ జేసే – పురిటిగడ్డలో పుట్టినావురా
కల్వటాల దండదిగో రా సై – ముక్క ముళ్ళ దండదిగోరా సై
సంజామల దండదిగోరా సై – కానాల దండదిగోరా సై (సైరా)”