ఖమ్మం జిల్లాలో పాలేరు ఉపఎన్నికలలో తెదేపా పోటీ చేయకపోవడం, తన రాజకీయ ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంపై తెరాస పార్టీ చేస్తున్న విమర్శలకి తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానం వింటే అది సమాధానంలా కాక ఎన్నికలలో పోటీ చేయనందుకు తెరాసకు సంజాయిషీ ఇచ్చుకొంటున్నట్లుంది. ఒక ప్రజాప్రతినిధి చనిపోయినప్పుడు వారి కుటుంబసభ్యులు పోటీ చేయదలచుకొంటే ఆ స్థానాన్ని వారికే వదిలిపెట్టి వారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించే ఒక మంచి సాంప్రదాయాన్ని తమ పార్టీ గత రెండు దశాబ్దాలుగా ఏవిధంగా పాటిస్తూ వచ్చిందో రేవంత్ రెడ్డి సోదాహరణంగా చెప్పుకొచ్చి, అందుకే పాలేరులో కూడా తమ పార్టీ పోటీ చేయడం లేదని చెప్పారు. పోటీ చేయనంత మాత్రాన్న తెలంగాణాలో తెదేపా బలహీనపడిందని తెరాస ప్రచారం చేయడం సరి కాదని అన్నారు. తెరాసకి తోడూ మీడియా కూడా ఇటువంటి దుష్ప్రచారంలో పాలు పంచుకొంటున్నందుకు ఆయన విచారం వ్యక్తం చేసారు.
అయితే తెలంగాణాలో తెదేపా బలహీనపడిందనే వాస్తవాన్ని ప్రజలకు తెరాస లేదా మీడియా గానీ పనిగట్టుకొని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాని పరిస్థితి ఏవిధంగా ఉందో రేవంత్ రెడ్డితో సహా అందరికీ తెలుసు. ఆ వాస్తవాన్ని ఆయన అంగీకరించి, ఆ తరువాత ఆ సాంప్రదాయం గురించి మాట్లాడి ఉండి ఉంటే కొంత సహేతుకంగా ఉండేది.
తెదేపాకి మిత్రపక్షంగా ఉందో లేదో తెలియని స్థితిలో ఉన్న భాజపా కూడా ఈ ఉపఎన్నికలలో పోటీ చేయడం లేదు. అందుకు అది ఎటువంటి సంజాయిషీలు, కారణాలు చెప్పుకోలేదు. “తమ పార్టీ ఈ ఉపఎన్నికలలో పోటీ చేయడం లేదు ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు,” అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ప్రకటించారు. అంటే కాంగ్రెస్ అభ్యర్ధికి కూడా మద్దతు ఇవ్వడం లేదని అర్ధం. రాష్ట్రంలో భాజపా చాలా బలహీనపడింది. తెరాసను డ్డీకొని విజయం సాధించే పరిస్థితి లేదు. అందుకే ఈ ఉపఎన్నికలలో భాజపా పోటీ చేయడం లేదు. అదే పరిస్థితులలో ఉన్న తెదేపా కూడా అందుకే పోటీ చేయడం లేదని అర్ధమవుతూనే ఉంది. అయితే అది ఒప్పుకోవడానికి రేవంత్ రెడ్డికి అహం అడ్డం వస్తున్నట్లుంది. ఈ ఉపఎన్నికలలో పోటీ చేయకుండా ఉండటానికి రేవంత్ రెడ్డి మంచి కారణమే చెప్పారని సరిపెట్టుకోవచ్చు. ఒకవేళ మున్ముందు మళ్ళీ వేరే ఏదయినా ఎన్నికలు ఎదుర్కోవలసి వస్తే అప్పుడేమి చెపుతారో?