రెండ్రోజులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్యపై బీఆర్ఎస్ సోషల్ మీడియా యుద్ధం ప్రకటించింది. వరంగల్ టికెట్ తీసుకొని… చివర్లో హ్యాండిచ్చారన్న కోపంకు తోడు గత అసెంబ్లీ సెషన్ లో హరీష్ రావు తర్వాత స్థానం ఇచ్చినా కడియం పార్టీ మారటం ఆ పార్టీ ఇంకా జీర్ణించుకోవట్లేదు. అందుకే ఎంత వీలైతే అంత డ్యామెజ్ చేసే ఉద్దేశం కనపడుతోంది.
నిజానికి కడియం పార్టీ మారుతారని ముందు నుండే ప్రచారం జరిగినా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఫలితంగా కడియంకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు, కడియం కూడా పార్టీ మారటం బీఆర్ఎస్ కు వరంగల్ లో ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెట్టింది.
నిజానికి కడియం పార్టీ వీడటం కన్నా బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను నైతికంగా బలహీన పర్చారన్న కోపం ఎక్కువగా ఉంది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మహబూబ్ నగర్, ఖమ్మం ఎంపీ అభ్యర్థులపై కూడా పడినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి యాక్టివ్ గా లేరన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలోని కొందరు నేతల తీరుతో ఆయన నొచ్చుకున్నారని, పైగా తనకు కుడి భుజంగా ఉన్న సోదరుడి కొడుకు కాంగ్రెస్ లో చేరిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పక్కా గెలుస్తందన్న ఖమ్మం సీటు విషయంలోనూ ఇదే జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు టికెట్ ఇచ్చినా కిందిస్థాయిలో ఆయన ప్రచారం అంతంత మాత్రమేనన్న అభిప్రాయం పార్టీలోనే ఉంది. ఈ పరిస్థితులకు బీజం కడియం కావ్య పార్టీ మారటంతోనేన్న బలమైన ఫీలింగ్ తో పార్టీ అధినాయకత్వం ఉండటంతో సోషల్ మీడియా కూడా వీలు దొరికినప్పుడల్లా కడియంను టార్గెట్ చేస్తోంది.
తాజాగా కడియం శ్రీహరి పేరు తీయకుండానే 10కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర తీసుకున్నారని, పార్టీ మారేందుకు రెండు రోజుల ముందే ఇదంతా జరిగిందని బీఆర్ఎస్ అనుకూల హ్యాండిల్స్ లో ప్రచారం కావటం ఇప్పుడు వైరల్ అవుతోంది. పర్సనల్ డ్యామెజ్ అని అర్థమైతున్నప్పటికీ కేసీఆర్ కు 10కోట్లు ఎలా వచ్చాయన్నది అధికారికంగా ఎలా చూపించగలుగుతారో అర్థం చేసుకోలేదా? ఇప్పటికే కవితపై ఈడీ కేసులుండగా… కేసీఆర్ ను సొంత సోషల్ మీడియానే ఇరికిస్తుందా? అన్న కామెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.