పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం తాను చాలా శ్రమిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాదీ, లేదా 2019 నాటికి పోలవరం ద్వారా నీళ్లిస్తామని చెబుతున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా తాజాగా ఇదే చెబుతున్నారు. శాఖాపరంగా ఎలాంటి అడ్డంకులూ ఉండవని అంటున్నారు. అయితే, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయనీ, కొన్ని పనులను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి తప్పించి.. వేరే కంపెనీకి ఇవ్వడం ద్వారా వేగవంతం అవుతాయని చంద్రబాబు భావించారు. దానికి అనుగుణంగా ఆ కంపెనీకి నోటీసులు ఇవ్వడం, కొత్త టెండర్లకు వెళ్లబోతే కేంద్రం మోకాలు అడ్డటం, ట్రాన్స్ ట్రాయ్ ను వెనకేసుకొచ్చే విధంగా నితిన్ గడ్కరీ వ్యవహరించడం.. ఇవన్నీ ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు. ఈ క్రమంలో చివరిగా జరిగింది ఏంటంటే… ట్రాన్స్ ట్రాయ్ కి మరో నెలరోజులు సమయం ఇద్దామనీ, ఆ తరువాత ఓ నిర్ణయం తీసుకుందామంటూ గడ్కరీ సమక్షంలో చంద్రబాబు కూడా ఓకే అనేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… పోలవరం పనులు ఒక్కరోజు కూడా ఆగకూడదని చెప్పే చంద్రబాబు, ఆ కంపెనీకి మరో నెలరోజులు సమయం ఇద్దామని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పగానే సరే అనాల్సి వచ్చింది! నిజానికి, ట్రాన్స్ ట్రాయ్ నుంచి కొన్ని పనులు తప్పించి, వాటిని వేరే కంపెనీలకు ఇవ్వడం ద్వారా వీలైనంత త్వరగా పనులు చేయించాలన్నది చంద్రబాబు ఆలోచన. అది కూడా ఎన్నికల అవసరం కాబట్టి..! కాపర్ డ్యామ్ పూర్తయితే గ్రావిటీ ద్వారా కాలువలకు నీళ్లు ఇవ్వొచ్చు. సో.. ఒకసారి నీళ్లు ఇవ్వడం మొదలుపెడితే, పోలవరం ద్వారా రైతులకు నీళ్లు ఇచ్చేస్తున్నాం అని భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటారు. అయితే, ఈ లక్ష్యంతో ట్రాన్స్ ట్రాయ్ ని తొందర పెడుతుంటే… పనుల ఆలస్యానికి వారు చూపే కారణాలు వేరుగా ఉన్నాయి. అందుకే, ఆ కంపెనీని కొన్ని పనుల వరకూ సైడ్ చేద్దామని అనుకున్నారు. కానీ, కేంద్రం మాత్రం దీనికి అడ్డుపడిందనే చెప్పొచ్చు.
ట్రాన్స్ ట్రాయ్ విషయంలో కేంద్రం కొంత సానుకూల ధోరణిలో ఉంది. ఇంతకీ, కేంద్రమంత్రి గడ్కరీకి ఈ ప్రేమ ఎందుకు అనే దానిపై తాజాగా ఢిల్లీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. కేంద్ర మంత్రి గడ్కరీ కుమారుడికీ, రాయపాటి సాంబశివరావుకీ మధ్య కొన్ని వ్యాపార సంబంధాలు ఎప్పట్నుంచో ఉన్నాయట. అందుకే, చంద్రబాబు ఎంతగా పట్టుబట్టినా… ట్రాన్స్ ట్రాయ్ కి నితిన్ గడ్కరీ కొంత గడువు ఇవ్వడం వెనక ఈ మతలబు ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రం ట్రాన్స్ ట్రాయ్ పట్ల కాస్త సానుకూలంగా వ్యవహరించడం వెనక ఈ లింక్ ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి.