‘ఛల్ మోహన రంగ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఓ వెలితి కొట్టొచ్చినట్టు కనిపించింది. అదే త్రివిక్రమ్ లేకపోవడం. పవన్, త్రివిక్రమ్‌లను కలసి కట్టుగా చూడడం అభిమానులకు సరదా. ఈ చిత్రానికి వాళ్లిద్దరూ నిర్మాతలు. నితిన్‌కి బాగా కావల్సిన వాళ్లు. అలాంటప్పుడు.. త్రివిక్రమ్ రాకుండా ఎలా ఉంటాడు? పైగా పవన్ ఆ వేడుకకు ముఖ్య అతిథి. పవన్‌తో ఆడియో ఫంక్షన్లకు హాజరవ్వడం త్రివిక్రమ్‌కి ఈ మధ్య అలవాటుగా మారింది. తాను నిర్మాతగా ఉన్న ఈ సినిమాతో ఇంకొంత ఎటాచ్మెంట్ ఉంటుంది. ఏ కోణంలోంచి చూసినా.. త్రివిక్రమ్ ఈ కార్యక్రమానికి వస్తాడనే అనుకుంటారు. కానీ సైలెంట్ గా డుమ్మా కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు త్రివిక్రమ్.
ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోవడానికి ప్రత్యేకమైన కారణాలేం లేవు. ఒక్క ‘అజ్ఞాతవాసి’ ఎఫెక్ట్ తప్ప. ‘అజ్ఞాతవాసి’ తరవాత పవన్ – త్రివిక్రమ్‌ల మధ్య దూరం మొదలైందని సన్నిహిత వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఇద్దరూ టచ్‌లో లేరు.. అలాగని ఇదివరకటిలా మరీ అంత ఎటాచ్మెంట్తోనూ లేరన్నది వాస్తవం. ఆ సినిమా తరవాత అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. `ఛల్ మోహన రంగ` ప్రీ రిలీజ్‌కి త్రివిక్రమ్ కూడా వచ్చుంటే.. ఇది వరకటిలా.. పవన్ – త్రివిక్రమ్‌ల మధ్య కెమిస్ట్రీ కనీసం కెమెరాలకైనా కనిపిస్తే బాగుండేది. ‘అజ్ఞాతవాసి తో ఓ తప్పు చేశాం… దాని ఓ గుణపాఠంగా నేర్చుకుని.. ఈసారి మంచి సినిమా అందిస్తాం’ అని త్రివిక్రమ్ తన అభిమానులకు మాట ఇస్తే ఇంకా బాగుండేది. ఆ అవకాశాన్ని వృధా చేసుకున్నాడు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి తరవాత మీడియాకు బహు దూరంగా ఉన్న త్రివిక్రమ్.. తొలిసారి వాళ్ల ముందుకు వచ్చే అవకాశం వచ్చింది. దాన్ని వదలుకున్నాడు. వవన్ – త్రివిక్రమ్ ల మధ్య దూరం పెరిగింది అని వస్తున్న పుకార్లకు ఇంకాస్త ఊతం ఇచ్చాడు.