మాజీ తెదేపా నేత ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల చివరి రోజయిన బుధవారంనాడు శాసనమండలి ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదురయినప్పుడు ఆయనతో కొంతసేపు మాట్లాడారు. ఇటీవల వైకాపా ఎమ్మెల్యేలు వరుసగా తెదేపాలో చేరుతున్న నేపధ్యంలో ఒకప్పడు చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితంగా మెలిగిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు ఆయనతో మాట్లాడటంతో అందరూ ఆయనని అనుమానంగా చూసారు. వారి అనుమానాలు నివృతి చేస్తూ “చంద్రబాబు నాయుడు ఎదురుపడి నా ఆరోగ్యం ఎలాగ ఉందని పలకరించి మొహం తిప్పుకొని వెళ్లిపోవడం మర్యాద కాదు కనుక నేను మర్యాదపూర్వకంగా ఆయనతో కాసేపు మాట్లాడాను తప్ప నాకు పార్టీ మారే ఆలోచన లేదు,” అని మీడియాకి చెప్పారు. కానీ ఆయన మాటలు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఆయన పార్టీ మారకపోయినప్పటికీ, అందరూ చూస్తుండగా ఆయన తన బద్ధ శత్రువయిన చంద్రబాబు నాయుడుతో కబుర్లు చెప్పడం జగన్మోహన్ రెడ్డిలో అనుమానాలు రేకెత్తించవచ్చును. అదే కనుక జరిగితే ఆయన పట్ల జగన్ వైఖరిలో మార్పు కనబడవచ్చును. అప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులుకి నిజంగా తెదేపాలో చేరే ఉద్దేశ్యం లేకపోయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితులలో తెదేపాలో చేరవలసి వస్తుందేమో? అదే జరిగితే అది మరో వింతవుతుంది.