కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారంపై ఆ పార్టీలో మళ్లీ కొంత స్పందన కనిపిస్తోంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు హడావుడి సృష్టించడం, మండలి ఛైర్మన్ పై హెడ్ ఫోన్స్ విసిరేయడం, ఇద్దరి సభ్యత్వాలను సభ రద్దు చేయడం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై ఆ ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. సంపత్, కోమటిరెడ్డిలను కొనసాగించాలని హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. తీర్పు వచ్చి దాదాపు ఇరవై రోజులకుపైగా గడిచినా, ప్రభుత్వం లేదా అసెంబ్లీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ… పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ కలుసుకున్నారు.
కోర్డు ఇచ్చిన జడ్జిమెంట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచిగానీ, అసెంబ్లీ నుంచిగానీ ఎవ్వరూ అప్పీలు చేయలేని ఉత్తమ్ మీడియాతో చెప్పారు. అంతేకాదు, ఆ తీర్పును యథతథంగా అమలు చేయలేదని కూడా గవర్నర్ కు తాము వివరించామన్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పినా… ప్రభుత్వం, శాసన సభ, డీజీపీ, ప్రధాన కార్యదర్శి వీరెవ్వరూ కోర్టు ఆదేశాలను ఖాతరు చేయడం లేదని ఆరోపించారు. గవర్నర్ కు కొన్ని విచక్షణాధికారాలు ఉన్నాయనీ, వాటిని ఉపయోగించి కోర్టు తీర్పు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశామని ఉత్తమ్ చెప్పారు.
కోర్టు తీర్పు వచ్చినా శాసన సభ స్పందిస్తుందీ, ఈ ఇద్దరినీ సభలోకి అనుమతిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే, గతంలో కూడా జంప్ జిలానీల అనర్హతలపై కూడా స్పీకర్ ఇలానే మౌనంగా ఉండిపోయారు. కోర్టు తీర్పు తరువాత కాంగ్రెస్ కూడా సంపత్, కోమటిరెడ్డి విషయంలో తరువాత ఏం చెయ్యాలనేది పాలుపోక… కొంత స్తబ్దుగా ఉండిపోయింది. అయితే, ఓ మూడు రోజుల కిందట… పార్టీ నేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంపత్ కాస్త తీవ్రంగానే పార్టీ నేతలపై విరుచుకుపడ్డట్టు సమాచారం! ఇద్దరు ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితిలో పార్టీ ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇదే అభిప్రాయం కిందిస్థాయి పార్టీ వర్గాలకు కలిగితే ప్రభావం వేరేలా ఉంటుందని కూడా క్లాస్ తీసుకున్నారట! కోమటిరెడ్డి కూడా పార్టీ తీరుపై ఇదే తరహా అసహనం వ్యక్తం చేశారనీ సమాచారం. సో… దాని ప్రభావమే ఇవాళ్ల గవర్నర్ దగ్గరకి ఉత్తమ్ తోపాటు కొందరు నేతలు వెళ్లి, మళ్లీ ఇదే అంశాన్ని ప్రస్థావించి, కొంత చర్చకు ఆస్కారం ఇచ్చేలా ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.