ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణకు వచ్చారు వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు పౌర సన్మానం చేశారు. ఇరువురు నేతలూ ఒకరినొకరు మెచ్చుకున్నారు. తెలుగుతోపాటు హిందీ ఇంగ్లిష్ లలో అద్భుతమైన వాక్చాతుర్యం ఉన్న నేత వెంకయ్య నాయుడు అంటూ కేసీఆర్ పొగిడారు. సామాన్యులకు అర్థమైన భాషలో మాట్లాడితే అందులోని అర్థం, పరమార్థం ప్రజలకు చేరుతుందనీ, అలాంటి వాక్చాతుర్యం కేసీఆర్ సొంతమని వెంకయ్య కూడా మెచ్చుకున్నారు! ఇదంతా సరేగానీ… ఇంతకీ ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై కేసీఆర్ కు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘ఇద్దరు నాయుళ్లు’ అంటూ చంద్రబాబు, వెంకయ్యలను కలిపి విమర్శలు గుప్పించిన తెరాస అధినేత… ఇప్పుడు ఎందుకిలా వ్యవహరించారూ అనేదే చర్చ. ఉపరాష్ట్రపతిని సన్మానించడం తప్పేం కాదుగానీ… ఏ ప్రయోజనం లేకుండా కేసీఆర్ ఈ స్థాయిలో ఏ పనీ చెయ్యరు కదా అనేదే పాయింట్!
వెంకయ్య నాయుడు సన్మానానికి దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇప్పించారు. ఆ సన్మానంలో ఎలా చేశారంటే… ముఖ్యమంత్రే స్వయంగా వెంకయ్యకు తిలకం దిద్ది, అత్తరుపూసి, పన్నీరు చిలకరించడం విశేషం. ఇలా చేసిన తీరును విమర్శించడం కాదుగానీ… దీని వెనక ఓ రాజకీయ ప్రయోజనం ఉందనేది చెప్పడమే ఇక్కడి లక్ష్యం! రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు ఏంటంటే… వెంకయ్య నాయుడుని సన్మానించడం ద్వారా, తెలంగాణలో ఉంటున్న ఆయన సామాజిక వర్గాన్ని తెరాస దగ్గరకు చేర్చే ప్రయత్నం! రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాస్త గందరగోళ స్థితిలో ఉంది. దీంతో ఆ సామాజిక వర్గం కూడా కాస్త ఆందోళనలోనే ఉంది. ఎటువైపు మొగ్గు చూపాలా అనే స్థితిలో వారున్నారు. ఇలాంటి వాతావరణంలో.. వెంకయ్య నాయుడుని అమాంతంగా ఆకాశానికి ఎత్తేయడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని కాస్తైనా తమవైపు తిప్పుకోవడమే కేసీఆర్ వ్యూహంగా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం! నిజానికి, తెలంగాణలో ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉంటున్న నేతలు ఎవ్వరూ లేరు. ఉన్న ఒక్క తుమ్మల నాగేశ్వరరావు కూడా తెరాసలో మంత్రిగానే ఉన్నారు. ఆయన రాష్ట్రస్థాయిలో ఆ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే విధంగా క్రియాశీలత చూపడం లేదు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు సన్మానం ప్రభావం వారిపై పడుతుందని సీఎం ఆశిస్తున్నట్టుగా కొంతమంది చెబుతున్నారు. ఇలాంటి ప్రయోజనం ఏదో ఆశించకపోతే ఏకంగా రూ. 15 కోట్లు ఖర్చు చేసి మరీ సన్మానం చేయాల్సిన అవసరం కేసీఆర్ కు ఏముంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.