మూడు రాజధానుల నిర్ణయాన్ని మోడీ కూడా అడ్డుకోలేడని ప్రకటిస్తున్న విజయసాయిరెడ్డి .. విశాఖలో తన పనిని హైస్పీడ్‌లో చేస్తున్నారు. ఆ పని.. భూములను మార్కింగ్ చేయడమే. పనికొచ్చే ఖరీదైన భూములన్నింటి జాబితాలను తెప్పించుకున్న ఆయన ఇప్పుడు.. వాటిని ఎలా స్వాధీనం చేసుకోవాలా అన్నదానిపై ప్రత్యేకంగా అధికారులతో కలిసి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు విశాఖలో ఇదే కలకలం రేపుతోంది.
వాల్తేక్ క్లబ్, దసపల్లా భూములపై మొదటి పంజా..!
వాల్తేర్ క్లబ్…! ఈ పేరు తెలియని విశాఖ వాసులు ఉండరు. అత్యంత ప్రైమ్ లోకేషన్లో ఉండే.. ఈ క్లబ్లో.. హై ప్రోఫైల్ వ్యక్తులందరూ సభ్యులుగా ఉంటారు. 31 ఎకరాల్లో విస్తరించిన ఈ క్లబ్ భూములపై కొన్ని న్యాయవివాదాలు ఉన్నాయి. ఈ న్యాయవివాదాలను ఆసరా చేసుకుని విజయసాయిరెడ్డి.. మొదటి పాచిక వేస్తున్నారు. ఈ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి.. తగ్గట్లుగా.. ఫైల్స్ అన్ని తెప్పించుకుని.. నేరుగా అడ్వకేట్ జనరల్‌తో పాటు.. విశాఖ నగరపాలక సంస్థ ఉన్నతాధికారుల్ని కూర్చోబెట్టుకుని ఏం చేయాలో.. ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ భూముల విషయంలో కోర్టులో ఉన్న కేసులతో ఎలా వ్యవహరించాలి..? వాల్తేర్ క్లబ్ యాజమాన్యాన్ని ఎలా “ఫిక్స్” చేయాలన్నదానిపై విజయసాయిరెడ్డి ప్రణాళికలు సిద్దం చేశారంటున్నారు. అలాగే.. విశాఖలో గవర్నర్ బంగ్లాకు సమీపంలో ఖాళీగా ఉన్న ఐదెకరాల విలువైన దసపల్లా భూములపైనా విజయసాయిరెడ్డి కన్నేశారు. 30ఏళ్లుగా ఈ భూ వ్యవహారం నలుగుతోంది. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దసపల్లా రాణి కమలాదేవికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అయినా సరే.. వాటిని ఎలా స్వాధీనం చేసుకోవాలన్నదానిపై విజయసాయిరెడ్డి స్కెచ్‌లు రెడీ చేస్తున్నారు.
విశాఖలో విజయసాయి మకాం వెనుక మతలబు అదేనా..?
ఎన్నికల ముందు నుంచీ విజయసాయిరెడ్డి.. కార్యక్షేత్రం విశాఖపట్నంలోనే ఉంది. ఆయన అప్పట్నుంచి భూముల సర్వే చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి ఓ సారి పాదయాత్ర చేశారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనరు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం కడా ఆయనకు లేదు. అయినప్పటికీ.. పాదయాత్ర ఎందుకు చేశారో చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు.. విజయసాయిరెడ్డి.. ప్రత్యేకంగా అధికారులను కూర్చోబెట్టుకుని.. విశాఖలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల గురించి విడమర్చి చెబుతుండటంతో.. ఆశ్చర్యపోవడం అధికారుల వంతు అవుతోంది. విశాఖలో కూర్చుని విజయసాయిరెడ్డి భూ అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.
సూపర్ సీఎంగా విజయసాయిరెడ్డి వ్యవహారం..!?
విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ మాత్రమే. ఆయనకు.. అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టడానికి ఆదేశాలు జారీ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ.. ఇక్కడ విజయసాయిరెడ్డి.. అన్ని వ్యవహారాల్లోనూ వేలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉత్తరాంద్రకు చెందిన అధికారులందరికీ నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారులందరూ.. ఆయన ఏరికోరి తెచ్చుకున్న వారే కావడంతో జీ హూజూర్ అంటున్నారు. ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రిగా విజయసాయిరెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.