హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య టాలీవుడ్ ని దిగ్భ్రాంతిలో ముంచింది. ఆత్మహత్యకు గల కారణాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. భార్యతో ఉన్న కలహాల కారణంగానే మనస్థాపానికి గురైన విజయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని విజయ్ తల్లి ఆరోపిస్తోంది. కొన్నేళ్ల క్రితం వనిత అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు విజయ్. కొంతకాలంగా భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారని, కోర్టులో విడాకులకు అప్లికేషన్ పెట్టుకున్నారని తెలుస్తోంది. విజయ్‌కు ఓ కుమార్తె. తాను కూడా వనిత దగ్గరే ఉంటుటోందని, విజయ్ దగ్గరకు పంపించడానికి ఆమె ససేమీరా అంటోందని, వారానికి ఒకసారి విజయ్ తన కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి, ఓ గంట ఉంచుకుని మళ్లీ భార్య దగ్గర విడిచి పెట్టి వచ్చేవాడని విజయ్ తల్లి చెబుతున్నారు. ఆదివారం విజయ్ ఇంటికి వచ్చిన వనిత.. విజయ్ కారుని ఎవ్వరికీ చెప్పకుండా తీసుకెళ్లిందని, ఈ విషయంలో విజయ్ కీ వనితకూ మధ్య గొడవ జరిగిందని, తెల్లారేసరికి విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందుతోంది. ఆత్మ హత్య చేసుకుంటున్నప్పుడు విజయ్ ఓ సెల్ఫీ రూపంలో వీడియో కూడా తీసుకున్నాడని.. అది ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉందని, ఆ వీడియో బయటకు వస్తే.. విజయ్ ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు బయటకు వస్తాయని తెలుస్తోంది.