నందమూరి బాలకృష్ణ దృష్టంతా ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌పైనే ఉంది. కాకపోతే… అది పట్టాలెక్కడానికి టైమ్ పడుతుంది. ఈలోగా మరో సినిమా పూర్తి చేయొచ్చు కూడా. సి.కల్యాణ్ ఆలోచన కూడా అదే. బాలయ్యకు ఇప్పటికే సి.కల్యాణ్ అడ్వాన్స్ ఇచ్చేశాడు. అందుకే ఎలాగోలా బాలయ్యతో సినిమా సెట్ చేయాలన్నది ఆయన ప్లాన్. ఆయన చేతిలో ఉన్న ఆప్షన్… వినాయక్ మాత్రమే. ఇంటిలిజెంట్ సినిమాతో సి.కల్యాణ్ చాలా నష్టపోయాడు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికైనా… కల్యాణ్‌కి వినాయక్ మరో సినిమా చేయాలి. వినాయక్ ఇప్పుడు ఎవరితోనూ కమిట్మెంట్స్ పెట్టుకోలేదు. అనుకుంటే.. బాలకృష్ణతో సినిమా చేయగలడు కూడా. కానీ… వినాయక్ మాత్రం బాలయ్యతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
వినాయక్- బాలకృష్ణ కాంబినేషన్ లో చెన్నకేశవరెడ్డి వచ్చింది. అది యావరేజ్‌గా ఆడింది. అయితే బాలయ్యని చూపించిన విధానం అభిమానులకు బాగా నచ్చింది. అప్పటి నుంచీ వినాయక్ బాలయ్య కాంబోలో సినిమా రాలేదు. అసలు ఆ ప్రసక్తే రాలేదు. ఇప్పుడు వచ్చినా… వినాయక్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. చెన్నకేశవరెడ్డి సెట్లో బాలయ్య వినాయక్‌ని కాస్త గట్టిగానే మందలించాడని.. అప్పటి నుంచీ బాలయ్య అంటే వినాయక్ కాస్త భయపడుతున్నాడని, పైగా వినాయక్‌పై మెగా కాంపౌండ్ ముద్ర బలంగా ఉందని, ఈ దశలో బాలయ్యతో సినిమా తీసి.. మరో ఫ్లాప్ ఇస్తే.. కావాలనే బాలకృష్ణ సినిమాలకు సరిగా పనిచేయడంలేదన్న అపవాదు మోయాల్సివస్తుందని వినాయక్ భయపడుతున్నట్టు టాక్. అందుకే.. అటు బాలయ్య, ఇటు సి.కల్యాణ్ రెడీగా ఉన్నా.. వినాయక్ మాత్రం ముందుకు కదలడం లేదని తెలుస్తోంది. మరి ఈ అడ్డు తెరలు ఎప్పుడు తొలగుతాయో చూడాలి.