అడ్డగోలుగా దోచుకుని దొరికిపోయి జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితులకు వస్తున్న వైసీపీ ముఖ్యనేతలకూ పవన్ కల్యాణ్ కొత్త దేవుడిగా కనిపిస్తున్నారు. ఆయనను పొగిడి.. తాము బయటపడేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరందరికి విజయసాయిరెడ్డి దారి చూపించారు. నిన్నటి వరకూ నిత్య పెళ్లి కొడుకు..దత్తపుత్రుడు అని వాగిన నోళ్లు, సోషల్ మీడియా అకౌంట్లే ఇప్పుడు పవన్ కల్యాణ్ జాతీయ నేత, సూపర్ లీడర్ అంటున్నారు. ఎందుకంటే కాళ్లు పట్టేసుకుంటున్న తమను ఆయన కాపాడుతారని వారి నమ్మకం.
చేసింది అడ్డగోలు దోపిడీలు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ను కాకా పడితే ఆయన కాపాడుతారా అన్న సందేహం వారికి ఉండే ఉంటుంది కానీ ఓ రాయి వేస్తే పోలా అని పవన్ కల్యాణ్‌పై పొగడ్తల రాళ్లు విసురుతున్నారు. తమపై ఏదో ఓ మూల పవన్ సాఫ్ట్ కార్నర్ ఏర్పరచుకుంటే చారని తర్వాత కష్టాల్లో మాట సాయం అయినా చేస్తారని అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి బాటలోనే చాలా మంది ముందుకు రాబోతున్నారు. అందరూ పవన్ సీఎం అవ్వాలని కోరబోతున్నారు. చివరికి జగన్ రెడ్డి నోటి నుంచి కూడా ఆ మాట వస్తుందని చెబుతున్నారు.
కూటమిలో చిచ్చు పెట్టేందుకు.. ఆయనను బయటకు తెచ్చేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఇలా చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు పొగిడే కొద్దీ వైసీపీ ఇంకా ఇంకా భూమిలోతుల్లోకి దిగిపోతూ ఉంటుంది. ఆ పార్టీ స్థానాన్ని జనసేన అందుకుంటూ ఉంటుంది. ఈ మాత్రం రాజకీయం వాళ్లకీ తెలుసు కానీ.. ఇప్పుడు తాము తిన్న సొమ్ము కక్కకుండా.. జైళ్లకు వెళ్లకుండా కాపాడేది పవన్ కల్యాణేనని వారు నమ్ముకుంటున్నారు. అందుకే కొత్త దేవుడిగా కీర్తిస్తున్నారు.