ఏపీలో అత్యంత కీలకమైన హోంశాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా నేత వంగలపూడి అనితకు కేటాయించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ సభ్యులను కూడా కాదని అనితకు హోంశాఖను కేటాయించడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వంగలపూడి అనిత… టీడీపీ ఫైర్ బ్రాండ్. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలకు ముచ్చెమటలు పట్టించిన లీడర్లలో ఆమె కూడా ఒకరు. ఆమె నోరు నొక్కేందుకు వైసీపీ హయాంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అనితపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు కూడా నమోదు చేశారు. అయినా వెనక్కి తగ్గకుండా పోరాడారు. గతంలో టీచర్ గా పని చేసిన అనుభవం ఉండటంతో ప్రతి విషయంపై సమగ్రమైన అవగాహనా ఉంటుందని అనితకు హోంశాఖను కేటాయించినట్లు కనబడుతోంది.
అటు , వైసీపీ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినా హోం శాఖ మంత్రులుగా సుచరిత, తానేటి వనితలు సరిగా స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి. కానీ, అనిత మాత్రం అలాంటి దారుణాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది అనే నమ్మకంతో చంద్రబాబు ఆమెకు హోంశాఖను కేటాయించి ఉంటారని అంటున్నారు.