ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్ లో భారతజట్టు ఓటమి పాలవ్వడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాటర్లు పేలవమైన ఫామ్లో ఉండడం, పంత్ చెత్త షాట్లతో వికెట్లు పారేసుకోవడం మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మరోవైపు ఎంపైర్ తప్పుడు నిర్ణయాలు కూడా భారత్ కొంప ముంచేస్తున్నాయి. నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్ ఇలాంటి తప్పుడు నిర్ణయానికే బలయ్యాడు. ఈ మ్యాచ్లో స్థిరంగా ఆడుతూ, భారత్ ని ఓటమి గండం నుంచి గట్టెక్కించడానికి జైస్వాల్ చాలా కష్టపడ్డాడు. సెంచరీకి దగ్గరవుతున్న జైస్వాల్ .. ఓ వివాదాస్పద నిర్ణయంతో పెవీలియన్ దారి పట్సాల్సివచ్చింది.
కమిన్స్ వేసిన ఓ బంతిని జైస్వాల్ హుక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అది నేరుగా క్లీపర్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అప్పీల్ చేశారు. ఫీల్డ్ ఎంపైర్ దాన్ని నాటౌట్ గా ప్రకటించాడు. ఆసీస్ కెప్టెన్ డీఆర్ఎస్కి వెళ్తే.. థర్డ్ ఎంపైర్ పలు కోణాల్లో పరిశీలించి, జైస్వాల్ ని ఔట్ గా ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. బంతి బ్యాట్ కు గానీ, గ్లౌజ్కి గాని తాకినట్టు స్పైకో మీటర్ లో ఎక్కడా ఆధారాలు కనిపించలేదు. కేవలం బంతి గమనం మారిన కారణంతో థర్డ్ ఎంపైర్ ఔట్ ఇచ్చాడు. ఈ నిర్ణయంపై ఫీల్డ్ లో ఉన్న యశస్వీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్లని వివరణ అడగడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది.
కామెంటేటర్లు సైతం ఎంపైర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ గా యశస్వీని నాటౌట్ గా ప్రకటించాల్సిందని అభిప్రాయ పడ్డారు. హాట్ స్పాట్ సాంకేతిక లేకపోవడంతో.. యశస్వీ బలయ్యాడని వ్యాఖ్యానించారు. మరో 16 పరుగులు చేసి ఉంటే జైస్వాల్ సెంచరీ పూర్తయ్యేది. భారత్ ని కూడా ఓటమి బారీ నుంచి కాపాడేవాడు. ఎప్పుడైతే జైస్వాల్ ఔట్ అయ్యాడో… అక్కడే భారత్ ఓటమి ఖరారైంది.