చిరంజీవి – దేవిశ్రీ ప్రసాద్‌లది సూపర్ హిట్ కాంబో. శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి.. మొన్నటి ఖైదీ నెం.150 వరకూ వీరి కాంబోలో వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అట్టర్ ఫ్లాప్ అయిన అందరివాడులోనూ కొన్ని మంచి బీట్లు దొరుకుతాయి. అది దేవి మ్యాజిక్.
ఇక కొరటాల శివ – దేవిశ్రీ ప్రసాద్లదీ అంతకంటే మించిన కాంబో. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజీ, భరత్ అనే నేను.. ఇలా వరుసగా నాలుగు బ్లాక్ బ్లస్టర్లు. కొరటాల విజయాల్లో దేవిశ్రీ ప్రసాద్ పాత్రని విడదీసి చూడలేం. కొరటాల కథకు, దేవి సంగీతం బలం అయ్యింది. అయితే చిరంజీవి – కొరటాల కాంబోకి మాత్రం దేవిశ్రీ లేడు. ఆ ప్లేసులో మణిశర్మ వచ్చి చేరాడు.
నిజానికి మణిశర్మకు ఇంతటి అవకాశం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దేవిశ్రీ తప్పుకోవడానికీ, మణిశర్మ టీమ్ లో జాయిన్ అవ్వడానికి చాలా రకాలైన అంశాలు దోహదం చేశాయి.
ఒకటి… కొరటాలనే ఈ సినిమాకి దేవిశ్రీని పక్కన పెట్టాలనుకున్నాడు. ఒక కాంబోలో వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు కాస్త బ్రేక్ తీసుకోవాలనుకోవడం తప్పని సరి. ప్రతీ సినిమాకీ దేవీనే ఎంచుకోవాలన్న రూల్ ఏమీ లేదు. మరో సంగీత దర్శకుడితో పనిచేస్తే.. పాటల్లో కొత్తదనం తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందని కొరటాల భావించి ఉండొచ్చు. అందుకే ముందు నుంచీ ఆయన దేవిశ్రీ ప్రసాద్‌కి ప్రత్యామ్నాయం ఎంచుకునేందుకే ప్రయత్నిస్తూ వచ్చారు. ఒకరిద్దరి పేర్లు వినిపించాయి. వాళ్లు సైతం టాలీవుడ్‌కి కొత్త. అయితే సడన్‌గా మణిశర్మని ఖాయం చేసేశాడు కొరటాల.
దీనికి చిరు ఓ ప్రధాన కారణం. చిరు – మణిశర్మలది విడదీయరాని అనుబంధం. ఇద్దరి కాంబోలో ఎన్నో మంచి హిట్లున్నాయి. పైగా చిరు అంటే మణిశర్మకి వల్లమాలిన అభిమానం. ఈమధ్య `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో మణి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈతరానికి అవసరమయ్యే సంగీతం తాను ఇవ్వగలనని నిరూపించుకున్నాడు. అందుకే చిరు కాంపౌండ్ నుంచి మణికి మళ్లీ పిలుపొచ్చింది. దేవి తప్ప ఇంకెవరైనా ఓకే అన్న మైండ్ సెట్లో ఉన్న కొరటాలకు ఈ ఆప్షన్‌కి వంక పెట్టే అవసరం రాలేదు. అందుకే మణి ఫిక్సయ్యాడు.