పార్లమెంటు ముందు విజయసాయి రెడ్డి మాట్లాడారు! హా.. అంతే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు! కొత్తగా ఏమీ లేదు. కాకపోతే… సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎందుకొచ్చారూ, వచ్చిన పని ఏం చేస్తున్నారూ, ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న ప్రయత్నం ఏంటంటూ సీఎం బాధ్యత గురించి మాట్లాడటం విశేషం! అంటే, విజయసాయి రెడ్డి నోట ఈ మాటలు వింటుంటే కొంత కొత్తగా అనిపిస్తోంది.
గడచిన రెండు రోజులుగా ఢిల్లీ రోడ్లపై ఎక్కడ యూ టర్న్ కనిపించినా తనకు చంద్రబాబు నాయుడు గుర్తొస్తున్నారంటూ విజయసాయి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వచ్చిన ముఖ్యమంత్రి, ఢిల్లీలో చేస్తున్న పనులేంటని ప్రశ్నించారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరనీ, అయినాసరే పార్లమెంటు ప్రాంగణంలో కూర్చుని అందర్నీ బతిమలాడుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ కి గతంలో భాజపా, జనసేన అనే రెండు చక్రాలు ఉండేవనీ, ఇప్పుడా రెండూ ఊడిపోయాయని విమర్శించారు. చంద్రబాబును బలపరచేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడం లేదనీ, ఈరోజున ఆయన ఏకాకిగా మిగిలిపోయారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదనీ, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనీ, పాతిక ఎంపీ స్థానాలను వైకాపా గెలుస్తుందనీ, 150కి పైగా అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ఇదీ ఆయన వరస.
ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి హోదా కోసం చేస్తున్న ప్రయత్నం ఏంటని ప్రశ్నించే ముందు.. ఇంతకీ ఇన్నాళ్లుగా ఢిల్లీలో వారు చేస్తున్న ప్రయత్నం ఏంటో కూడా చెప్పాలి కదా. చివరి చంద్రబాబుతో కలిసేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు సరే.., కానీ, ఢిల్లీకి వచ్చిన రెండ్రోజుల్లోనే ఆయన ఏదో ఒక ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా విజయసాయి ఒప్పుకుంటున్నారు కదా! మరి, ఇన్నాళ్లుగా వైకాపా చేసిందేంటీ..? ఇంకోటి.. విజయసాయి ఏకంగా ఎన్నికల వరకూ వెళ్లిపోతున్నారు. చంద్రబాబు ఓడిపోతారనీ, జగన్ గెలిచేస్తారనీ.. ఈ చిలక జోస్యం చెప్పడానికా ఆయన ఢిల్లీ వెళ్లింది? ఇతర పార్టీలేవీ చంద్రబాబును పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు… వైకాపా చొరవ తీసుకుని ఆయా పార్టీలతో మద్దతు కూడగట్టొచ్చు కదా! ఆ ప్రయత్నమూ వైకాపా చెయ్యదు. కానీ, ప్రత్యేక హోదా వచ్చేస్తుందీ, తాము సాధిస్తామని చెబుతారు.
ఇదంతా చూస్తుంటే… వైకాపాని ఏపీలో హీరో చేయాలనే ఉద్దేశంతో భాజపా నడిపిస్తున్న స్క్రీన్ ప్లే ఏదైనా చాపకింద నీరులా సాగుతోందా అనే అనుమానం కలుగుతోంది. రేప్పొద్దున, ఎంపీ హరిబాబు చెప్పినట్టుగా ఏ కడప ఉక్కు ఫ్యాక్టరీనో, రైల్వే జోన్ విషయమై కేంద్రం ఏదైనా ప్రకటన చేస్తే.. వైకాపా పోరాట ఫలితంగానే తాము స్పందించామనే కలరింగ్ ఇచ్చే దిశగా భాజపా వ్యూహం ఉందేమో అనే అనుమానంగా ఉంది. లేదంటే, వైకాపాకి ఇంత ధీమా ఎక్కడి నుంచి వస్తుంది..?