అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన నలుగురు వైద్య సిబ్బందికి వైరస్ సోకింది. దీనికి కారణం.. పూర్తి నిర్లక్ష్యమే. హిందూపురానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చనిపోయాడు. అయితే.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పినా లైట్ తీసుకున్నారు. అతని శాంపిల్ తీసుకుని.. అంత్యక్రియల కోసం బంధువులకు ఇచ్చేశారు. అతనికి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు ఆయనకు వైద్యం చేసిన ఆస్పత్రి సిబ్బందికీ పాజిటివ్ వచ్చింది. ఆ వృద్ధుడికి కరోనా లక్షణాలు ఉన్నా.. వైద్యులు, వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోకుండా చికిత్స చేయడం వల్లే సమస్య వచ్చింది. ఇప్పటికే ఆస్పత్రుల్లో మాస్కులు, పీపీఈలు లేవన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలను ప్రశ్నించినందుకు ఓ డాక్టర్‌ను సస్పెండ్ చేసి.. కేసులు పెట్టింది ఏపీ సర్కార్. అలాంటి సమయంలో.. సరైన పీపీఈలు లేకపోవడం వల్ల… నలుగురు వైద్య సిబ్బందికి కరోనా సోకిన విషయం బయటపడటం కలకలం రేపుతోంది.
అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కరోనా మరణాల ప్రకటన..!
ఇది ఒక్కటే కాదు.. ఏపీలో కొద్ది రోజులుగా వైరస్ పేషంట్ల విషయంలో.. అనేక రకాల నిర్లక్ష్యాలు వెలుగు చూస్తున్నాయి. విజయవాడలో ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వ్యక్తి వైరస్‌తో చనిపోయాడు. విషయం తెలిసి కూడా.. డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అధికారులు ఇచ్చేశారు. మృతి విషయాన్ని కూడా మూడు రోజులు ఆలస్యంగా ప్రకటించారు. అతనికి ఇతర ఆరోగ్య సమస్యలున్నాయని చెబుతున్నారు. ఈ తరహాలోనే కొంత మంది వైరస్ అనుమానితులు.. చనిపోయినా.. వైద్యులు.. ఇతరులు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా.. వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. కరోనా వైరస్‌తో చనిపోతే.. ప్రత్యేక జాగ్రత్తలతో అంత్యక్రియలు చేయాలని కేంద్రం గైడ్ లైన్స్ జారీ చేసింది. కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు.
ఆ మటన్ షాపు ఓనర్ ఎంత మందికి వైరస్ తగిలించాడో..!?</span
విశాఖలో వెలుగు చూసినా ఓ కరోనా పాజిటివ్ కేసు.. నిర్లక్ష్యానికినిలువుటద్దంలా మారింది. భారత్‌లోకి ఇంటర్నేషన్ ఫ్లైట్స్ రావడం నిషేధించిన ముందు రోజు… కువైట్ నుంచి విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఇండియాకు వచ్చారు. ఆయనను క్వారంటైన్‌కు తరలించలేదు. నేరుగా విశాఖ వచ్చి .. తన చికెన్, మటన్ దుకాణాన్ని యుధావిధిగా నిర్వహించుకున్నారు. అప్పట్లోనే కేంద్రం జాబితా పంపడంతో… ఓ సారి అధికారులు వచ్చి.. ఆయన శాంపిల్ తీసుకెళ్లారు. పదిహేను రోజుల తర్వాత పాజిటివ్ వచ్చిందని చెప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ పదిహేను రోజులు ఆయన మటన్, చికెన్ అమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ పాజిటివ్ వ్యక్తి దగ్గర్నుంచి ఎంత మందికి వైరస్ చేరిందో అర్థం కాని పరిస్థితి.
అదే తగ్గిపోతుందన్న నిర్లక్ష్యంతోనే అసలు ప్రమాదం..!
ఆ.. ఏం జరుగుతుందిలే.. అనే మనస్థత్వం.. పై స్థాయి నుంచి వైరస్ విషయంలో మొదటి నుంచి చూపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాధినేతే… అసలు జబ్బే కాదని.. జ్వరమేనని చెప్పిన తర్వాత కింది స్థాయిలో నిర్లక్ష్యం ప్రబలకుండా ఎలా ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే… కేరళ, కర్ణాటకలను మించిపోయి మరీ.. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే చేయిదాటిపోయే పరిస్థితి వచ్చిందని రోజూ.. ఇబ్బడిమబ్బడిగా నమోదవుతున్న పాజిటివ్ కేసులే నిరూపిస్తున్నాయి. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.. లేకపోతే.. ప్రజలకు జరిగే నష్టాన్ని భర్తీ చేయడం ఎవరి వల్లా కాకపోవచ్చు.