సంక్రాంతి లో వరుసగా రెండు బ్లాక్ బ్లస్టర్ సినిమాలొచ్చాయి టాలీవుడ్‌కి. అందులో ఒకటి ఇండ్రస్ట్రీ రికార్డు. అయితే ఆ తరవాత…. హిట్టనే మాటే వినలేదు. వరుస ఫ్లాపులు టాలీవుడ్‌ని బాగా ఇబ్బంది పెట్టాయి. చాలా ఫ్లాపుల తరవాత… `భీష్మ` హిట్టు ఉపశమనం కలిగించింది. నితిన్ – రష్మికల కెమిస్ట్రీ, కామెడీ, రైటింగ్ స్కిల్స్ అన్నీ.. బాగా హెల్ప్ అయ్యాయి. దర్శకుడిగా వెంకీ కుడుముల మరోసారి మ్యాజిక్ చేయగలిగాడు.
అయితే ఈ హిట్టు వెనుక చాలా శ్రమ ఉంది. చాలామంది చేయి ఉంది. ముఖ్యంగా నితిన్ జడ్జ్‌మెంట్‌ని, ఓపికని మెచ్చుకోవాలి. వెంకీ కుడుముల లైన్ చెప్పగానే ఓకే అన్న నితిన్… స్క్రిప్టుని తనకు సంతృప్తికరంగా వచ్చేంత వరకూ ఓపిక పట్టాడు. కావల్సినప్పుడల్లా మార్పులు, చేర్పులు చేయడానికి అనుమతులు ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని రీషూట్లు జరిగాయి. ఎన్నిసార్లు మేకప్పులు చేస్తానన్నా… నిర్మాత నాగవంశీ బెదిరిపోలేదు. అవుట్‌పుట్ బాగా రావడానికి ఎంతైనా ఖర్చు పెట్టాడు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈ సినిమా చూసిన త్రివిక్రమ్ కొన్ని కీలకమైన సూచనలు చేశాడు. అది చాలా హెల్ప్ అయ్యింది. ట్రైలర్‌ని కట్ చేసే విషయంలోనూ త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది. మధ్యలో కొన్ని కామెడీ ఎపిసోడ్స్… వేరే రచయితలచేత రాయించినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు వాట్సప్ వీడియో, కారులో కామెడీ… ఇవన్నీ ముందు స్క్రిప్టులో లేవు. చివరిగా వచ్చి యాడ్ అయ్యాయి. ఇప్పుడు అవే బాగా ప్లస్ అయ్యాయి. ఇలా మొత్తానికి… భీష్మ విజయంలో చాలామంది చేయి వేశారు. ఎవరు ఎంత కష్టపడినా విజయం కోసమే. అది దక్కేసింది. ఇంకేం కావాలి.??