భారత త్రివిధ దళాల అధిపతి అంటే ప్రధానమంత్రి కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే మొత్తం రక్షణ వ్యవస్థ ఆయన చేతుల్లో ఉంటుంది. అందుకే ఆయన ప్రతి అడుగులోనూ వ్యవస్థ మొత్తం అప్రమత్తంగా ఉంటుంది. అలాంటి ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఒక్క సారిగా కుప్పకూలింది. గాల్లో మంటలు అంటున్నట్లుగా కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రాష్ ల్యాండింగ్ అయినట్లుగా మరికొన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. ఏం జరిగిందన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.
బిపిన్ రావత్ ప్రయాణించిన ఎంఐ 17 హెలికాఫ్టర్‌కు శత్రుదుర్భేద్యమైనదిగా పేరు ఉంది. ఈ రష్యా తయారీ హెలికాఫ్టర్‌ను ప్రపంచంలోని అనేక దేశాలు సైనిక… ప్రకృతి విపత్తు సహాయ చర్యల్లో వాడుతూ ఉంటారు. ప్రధాని, రాష్ట్రపతి వంటి వారి పర్యటనలకూ వాడుతూంటారు. వాటి నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. చిన్న లోపం ఉన్న గాల్లోకి ఎగరనీయరు. అంటే పక్కాగా సిద్ధం చేసిన తర్వాతే గాల్లోకి పంపి ఉంటారు. ఇంకా చెప్పాలంటే.. మంటల్లో తిరిగినా అంటుకోని రసాయనాలతో హెలికాఫ్టర్ కు రక్షణ ఉంటుంది. అయినా మంటలు అంటుకున్నట్లుగా భావిస్తున్నారు.
ఈ ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడవచ్చు కానీ.. కీడెంచి మేలెంచాలన్నట్లుగా అసలు ఎలా జరిగింది.. ఏదైనా కుట్ర కోణం ఉందా.. శత్రు దేశాలు ఏమైనా కుట్ర చేశాయా అన్న అంశాలపైనా అనేకాకనేక అనుమానాలు నిపుణులలో కలుగుతున్నాయి. బిపిన్ రావత్ సైలెంట్‌గా ఉండే అధికారి కాదు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతారు. చైనా, పాకిస్తాన్‌లపై తీవ్రంగా విరుచుకుపడతారు. బోర్డర్లో రక్షణపై ఆయనకు అపారమైన అనుభవం ఉంది.
ఇప్పటి వరకూ హెలికాఫ్టర్ ప్రమాదానికి కారణం ఏమిటన్నది కేంద్రం అధికారిక ప్రకటన చేయలేదు. పార్లమెంట్లో కేంద్రం ప్రకటన చేసిన తర్వాత ప్రమాదంపై స్పష్టత వస్తుంది. ప్రమాదమే అయితే ఇలాంటివి మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీరియస్‌గా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. స్వయంకృతంతో ఇలాంటి నష్టాలను ఎదుర్కొంటే.. దేశం తీవ్రంగా నష్టపోతుంది.