మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు టీడీపీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. యూరప్ నుంచి టీడీపీ అధినేత వచ్చిన తర్వాత ఒక్క సారి కూడా కలవలేదు. నిజానికి ఆయన పార్టీ వీడే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. కాకినాడలో కాపు నేతల సమావేశం గురించి… చంద్రబాబుకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ.. ఆయన ఇప్పుడు.. రగిలిపోతున్నారు. దానికి కారణం… ఆయన నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభిప్రాయసేకరణే.
మూడు రోజుల పాటు… తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నేతలకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమా పార్టీ వీడితే ప్రత్యామ్నాయం ఎవరని ఆ ఫోన్ కాల్స్ సారాంశం. ఈ విషయాన్ని కొంత మంది పార్టీ నేతలు బొండా ఉమా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తాను అన్ని విషయాలను అధినేతకు వివరిస్తే మరలా పార్టీ కార్యాలయం నుంచి ఇటువంటి ఫోన్ కాల్స్ రావడం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బొండా ఉమ అసంతృప్తి గురించి తెలుసుకున్న చంద్రబాబు బుధ, గురువారాల్లో ఫోన్లో మాట్లాడారు. తన నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఇలా చేస్తే నియోజకవర్గంలో పార్టీ దెబ్బతింటుందని, తన నాయకత్వాన్ని ఎవరు విశ్వసించరని ఆయన చంద్రబాబుకు ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. విషయం తెలుసుకున్న చంద్రబాబు అటువంటి కాల్స్ పార్టీ కార్యాలయం నుంచి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారంటున్నారు.