పోలింగ్‌కు వారం రోజుల ముందు చీఫ్ సెక్రటరీని బదిలీ చేసింది ఎన్నికల సంఘం. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ అసలు విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. పోలింగ్ తర్వాత కౌంటింగ్‌కు .. 40 రోజులకుపైగా సమయం ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం పని చేయకుండా చేయడానికి… సీఎం ఆదేశాలు పాటించకుండా చేయాడనికే… ఈ మార్పు అనేది… వైసీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. వైసీపీ బృందం గవర్నర్ ను కలిసి.. ఇదే డిమాండ్ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సచివాలయంపై చంద్రబాబు పెత్తనం ఉండకూడదని, కీలకమైన ఫైళ్లను తెప్పించుకుంటున్నారంటూ జగన్ ఏకంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మీడియాకు కూడా అదే చెప్పారు.
ఇది మాత్రమే కాదు.. ఈసీ తమ చెప్పు చేతల్లో ఉందన్నట్లుగా వ్యవహిస్తూ.. నేరుగా.. ఉన్నతాధికారులకే ఫోన్లు చేస్తున్న వైసీపీ నేతలు. నేరుగా ఫోన్లు చేయటంతోపాటు ఫైళ్ల కదలికలు ఏమైన ఉంటే తమకు చెప్పాలని ఓ రకమైన హెచ్చరికలు చేస్తున్నారు. కీలకమైన ఫైళ్లను ఎక్కడికైనా పంపితే తమకు తెలిసిపోతుందని, జాగ్రత్తగా ఉండాలంటూ వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారని సెక్రటేరియట్లో ప్రచారం జరుగుతోంది. కీలక ఫైళ్లను చంద్రబాబు తెప్పించుకుంటున్నారని ఆరోపించటమే కాకుండా ఫైళ్లను ఆయన వద్దకు పంపకుండా చీఫ్ సెక్రటరీ ఆదేశించాలని గవర్నర్ ను కోరామని బయటకు వచ్చాక చెప్పారు. కొంతమంది ఉన్నతోద్యోగులకు కూడా ఫోన్ చేసి తమ నేత అధికారంలోకి రాబోతున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా పరిపాలన ఉండదని, చాలా విభిన్నంగా ఉంటుందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పోలీస్ యంత్రాంగంపైనా ఇదే తరహా ప్లాన్ అమలు చేస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే… టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ముద్ర వేసేందుకు వెనుకాడటం లేదు. పోలీసులు టీడీపీకి వత్తాసు పలుకుతుందంటూ వైసీపీ అధినేత జగన్ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఈవీఎంలను దాచి ఉంచిన స్ట్రాంగ్ రూములకు కేంద్ర పారా మిలటరీ బలగాల భద్రత కల్పించాలని, రాష్ట్ర పోలీసులెవరూ ఉండకూడదని విజయసాయిరెడ్డి నేరుగా ఈసీకే వినతి పత్రం ఇచ్చారు. ఢిల్లీలో విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ గవర్నర్ కు చేసిన ఫిర్యాదు వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుగుదేశం అనుమానిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రభుత్వాన్ని పని చేయనివ్వకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.