బాలయ్య గట్టి షాకే ఇచ్చాడు. బోయపాటి తో సినిమా పక్కన పెట్టి – కె.ఎస్.రవికుమార్‌ని అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చాడు. బోయపాటి సినిమా ఆలస్యం అవుతుందని తెలుసు కానీ… మరీ ఇంత ఆలస్యం అవుతుందని, ఆ గ్యాప్ లో బాలయ్య మరో సినిమా చేసేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆఖరికి బోయపాటి శ్రీనుతో సహా. నిన్నా మొన్నటి వరకూ బాలయ్య తదుపరి సినిమా తనతోనే అన్నంత ధీమాగా ఉన్నాడు బోయపాటి. కానీ సడన్‌గా సమీకరణాలు మారిపోయాయి.
బోయపాటి సినిమా ఆగడానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. అసలు విషయమేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది తెలుగు 360
* బోయపాటి – బాలయ్య సినిమాని ఎన్నికల సీజన్లో విడుదల చేద్దామనుకున్నారు. దానికి తగ్గట్టుగానే పొలిటికల్ డ్రామా ఉన్న స్క్రిప్టుని రాసుకున్నాడు బోయపాటి. దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ వల్ల బోయపాటి సినిమా ఆలస్యమైంది. ఎన్నికల సీజన్ వెళ్లిపోయింది కాబట్టి ఇప్పుడు పొలిటికల్ డ్రామా తీయడంలో అర్థం లేదు. అందుకే కథలో కొన్ని మార్పులు చేశాడు బోయపాటి. దానికి బాలయ్య కూడా ఓకే అనేశాడు. అయితే ఇప్పుడు బాలయ్య ఆలోచన మారింది. ఆ కథని పూర్తిగా పక్కన పెట్టి, కొత్త కథ సిద్ధం చేయమన్నాడు. ఆ పనిలోనే ఉన్నాడు బోయపాటి. సాధారణంగా కథ విషయంలో బోయపాటి చాలా టైమ్ తీసుకుంటాడు. అందుకే.. ఈ సినిమా ఆలస్యం అవుతోంది.
* బోయపాటి రాసుకున్న కొత్త కథలో కథానాయకుడి పాత్రలో రెండు రకాల వేరియేషన్స్ ఉండాలి. ఓ పాత్ర కోసం ఇంచుమించు 20 కిలోల బరువు తగ్గాలి. మరోపాత్ర కోసం గడ్డం పెంచాలి. రకరకాల గెటప్పులు కూడా ట్రై చేస్తున్నారు. బోయపాటి కథకు తగ్గట్టుగా బాలయ్య మారాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుంది. ఈలోగా ఖాళీగా ఉండడం బాలయ్యకు ఇష్టం లేదు. అందుకే ఈ సినిమాని మొదలెట్టాడు.
* పైగా సి.కల్యాణ్ కి ఓ సినిమా చేస్తానని బాలయ్య ఎప్పుడో మాటిచ్చాడు. ఆ కమిట్మెంట్ ప్రకారం ఓ సినిమా చేసేస్తే పనైపోతుందని బాలయ్య భావన. పైగా కె.ఎస్.రవికుమార్ చకచక సినిమాలు తీయడంలో సమర్థుడు. ఇక మీదట తన సినిమాలన్నీ సొంత బ్యానర్లో తీసుకోవాలనుకుంటున్న బాలయ్య – వీలైనంత త్వరగా సి.కల్యాణ్ సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అందుకే… అనూహ్యంగా కె.ఎస్.రవికుమార్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ దొరికింది.