బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన నేతలకు మాత్రం దర్యాప్తు సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. గడ్డం వివేక్ ఇటీవల కాంగ్రెస్ లో చేరి చెన్నూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. దాని కోసమే రెడీగా ఉన్నామన్నట్లుగా ఈడీ అధికారులు సోదాలు చేశారు. వెంటనే ఓ ప్రకటన కూడా చేశారు. రెండు వందల కోట్ల అవకతవకలు జరిగాయన్నారు.
వివేక్ పై ఈడీ ఇచ్చిన ప్రకటన చూసి… పాపం అనుకుంటున్నారు ఇతర పార్టీల నేతలు. నిన్నటిదాకా ఆయన బీజేపీ నేత. ఏ ఒక్క దర్యాప్తు సంస్థ ఆయన జోలికి వెళ్లలేదు. కానీ కాంగ్రెస్ లో చేరగానే… ఈడీ కేసులు పెట్టేశారు. ఫెమా కేసులు నమోదు చేశారు. అసలు బీజేపీలోనే చేరని… ఆయన సోదరుడు గడ్డం వినోద్ పైనా ఈడీ ప్రయోగం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి అంటూ ఏసీబీ కేసు నమోదైతే.. అందులో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ కేసు పెట్టేసింది.
ఇప్పటికే బీజేపీ ఆఫర్ ను తిరస్కరించి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటిపైనా ఐటీదాడులు జరిగాయి. విచిత్రం ఏమిటంటే… బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయి. రెండు పార్టీలు ఒకటేనని దానికి సాక్ష్యం ఈ దాడులేనని అంటున్నారు. వివేక్ మాత్రం తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. రాజకీయ కుట్ర చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికి తమ సంస్థల తరపున ప్రభుత్వానికి పది వేలకోట్లు పన్నులు కట్టానని అంటున్నారు.