ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన వారి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు కారణం అవుతోంది. వారికి వచ్చిన వ్యాధిని నిర్ధారించడానికి.. కారణాలను కనిపెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. నీళ్ల కాలుష్యం వల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వస్తున్న విమర్శలను ప్రభుత్వం ఖండించింది. నీటి కాలుష్యం జరగలేదని ప్రకటించేసింది. బాధితులు మాత్రం నాలుగు రోజుల నుంచి రంగు మారిన నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. అదే సమయంలో బాధితుల రక్త పరీక్షల్లోనూ వ్యాధి ఏమిటో తెలియడం లేదని చెబుతున్నారు. ఈ ఘటనపై గవర్నర్ కూడా స్పందించారు. మరింత వేగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటి వరకూ మొత్తం 250 మంది ఇలా బాధితులయ్యారు. కొంత మందిని డిశ్చార్జ్ చేశారు. కొత్త కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలు… బాధితులను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. టీడీపీ నేత లోకేష్.. బీజేపీ నేత సోము వీర్రాజు , పరామర్శించారు. కృష్ణా కాల్వలో కరోనాకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్ వేస్తున్నారని.. దాని వల్లే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. సీఎం వెంటనే ఏలూరు వచ్చి పరిస్థితిని సమీక్షించాలని డిమాండ్ చేశారు.
కారణం ఏమిటో కనిపెడితే కానీ.. బాధితులకు సరైన వైద్యం అందించడానికి సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీరియస్గా ఉన్న కొంత మందిని విజయవాడ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కారణం ఏమిటన్నదానిపై త్వరలోనే విశ్లేషిస్తామని అధికారులు చెబుతున్నారు. అసలు కారణం ఏమిటో కనిపెట్టకపోతే.. మాస్ హిస్టీరియా వస్తుందని… మానసిక నిపుణులు చెబుతున్నారు.