దుబ్బాక ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ మూడో తేదీన పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీలన్నీ హడావుడి పడుతున్నాయి. అయితే.. అధికార టీఆర్ఎస్ మాత్రం మరీ కాస్త ఎక్కువగా హడావుడి పడుతోంది. ఆ ఉపఎన్నికల ఫలితం తేడా వస్తే.. మొత్తంగా నెగెటివ్ ట్రెండ్ ప్రారంభమవుతుందన్న ఆందోళన టీఆర్ఎస్లో కనిపిస్తోంది. ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావు ఉపఎన్నిక బాధ్యత తీసుకుని ఊరూవాడా తిరుగుతున్నారు. షెడ్యూల్ రాక ముందే.. ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. తానే అభ్యర్థి అన్నంతగా హైరానా పడుతున్నారు. హరీష్ రావు ఇంత సీరియస్‌గా పని చేయడం చూసి.. దుబ్బాకలో టీఆర్ఎస్కు అంత తేలిగ్గా ఏమీ లేదన్న అభిప్రాయం సామాన్యుల్లో ఏర్పడుతోంది.
మామూలుగా ఉపఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్‌గా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహాలు ఉండవు. టీఆర్ఎస్ విషయంలో ఉపఎన్నికల్లో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉంది. అత్యంత భారీ మెజార్టీలతో గెలుస్తారు. పైగా ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నిక ఎమ్మెల్యే మరణం ద్వారా వస్తోంది. సానుభూతి కూడా కలసి వస్తుంది. వీటన్నింటి మధ్య ఆడుతూ.. పాడుతూ ఎన్నికలు ఈదాల్సిన టీఆర్ఎస్ అపసోపాలు పడుతోంది. గత ఆరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు అందరని తాయిలాలన్నింటినీ ఎన్నికలు అయిపోగానే ఇస్తామని ఆశ పెట్టడమే కాదు.. టీఆర్ఎస్ కాకుండా వేరే వాళ్లకి ఓటేస్తే.. కరెంట్ కనెక్షన్లకు మీటర్లు వస్తాయని హరీష్ రావు భయపెడుతున్నారు.
నిజానికి దుబ్బాకలో అనుకున్నంత తేలిగ్గా పరిస్థితి ఏమీ లేదని టీఆర్ఎస్ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీ నేత రఘునందన్ రావు చాలా కాలంగా దుబ్బాక కేంద్రంగా పని చేసుకుంటున్నారు. ఆయన గ్రామగ్రామన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. టీఆర్ఎస్లో టిక్కెట్ కోసం పోటీ భారీగా ఉంది. దుబ్బాక అంటే.. చెరుకు ముత్యం రెడ్డి అని గతంలో పేరు ఉండేది. ఆయన కుమారుడు టీఆర్ఎస్ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇవ్వకపోతే.. ఏదో ఓ పార్టీ లేకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానంటున్నారు. ఆరేళ్ల ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత ఎంతో కొంత ప్రజల్లో కనబడుతూనే ఉంది. ఇదంతా.. హరీష్ రావు కంగారుకు కారణం అవుతోందన్న చర్చ జరుగుతోంది.