తిరుపతి ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. పధ్నాలుగో తేదీన ఆయన తిరుపతిలో ఎన్నికలప్రచారం చేయాలని నిర్ణయించారు. పదిహేనో తేదీతో ఎన్నికల ప్రచార గడువు ముగిసిపోతుంది. ఇప్పటి వరకూ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని ఎవరూ చెప్పలేదు. ఆయన ప్రచారం ఉండే చాన్స్ లేదని అనుకున్నారు. స్థానిక ఎన్నికల్లో సీఎం జగన్ ఓటు అడగకపోయినా జనం ఓట్లేశారని.. తిరుపతిలో కూడా అలాగే వేస్తారని వైసీపీ నేతలు చెప్పడం ప్రారంభించారు. అయితే అనూహ్యంగా సీఎం జగన్ ఓ రోజు ప్రచారానికి కేటాయించాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే తిరుపతిలో వైసీపీ పక్కా వ్యూహం అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున నేతల్ని మోహరించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యత అప్పగించారు. ఏడు నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి మంత్రిని..వారికి తోడుగా ఎమ్మెల్యేను పెట్టి.. ఓ టీమ్‌ను అప్పగించారు. ఇతర ప్రచారాలకు మంత్రుల్ని ఉపయోగిస్తున్నారు. ఇక యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండనే ఉన్నారు. ఇన్ని ఏర్పాట్ల మధ్య ఐదు లక్షల మెజార్టీని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉండటం… సామాజికవర్గ సమీకరణాలు కూడా… కలసి రావడంతో వైసీపీకి తిరుగులేదనుకున్నారు. అందుకే జగన్ ప్రచారం చేయరని అనుకున్నారు.
కానీ ఎందుకో జగన్ తాను స్వయంగా ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి ఆధ్యాత్మక నియోజకవర్గం కావడం.. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు హిందూ వ్యతిరేకి ముద్ర వేసినట్లుగా ఉండటంతో వాటిని కవర్ చేసుకోవాలంటే.. తాను ప్రచారానికి వెళ్లాలని ఆయన అనుకున్నట్లుగా చెబుతున్నారు. గతం కన్నా మెజార్టీ పెంచుకోవాలి కాబట్టి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఉంది. మరో వైపు జగన్ హడావుడిగా ప్రచార షెడ్యూల్ ఖరారు చేసుకోవడంతో.. ఇతర పార్టీలు కొన్ని సందేహాలు లేవనెత్తుతున్నాయి. పరిస్థితి బాగో లేదు కాబట్టే.. జగన్ రంగలోకి దిగుతున్నారని అంటున్నాయి. ప్రజల్లో కూడా అలాంటి ప్రచారమే జరిగే అవకాశం ఉంది.