షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రులకు సీఎం జగన్ తేల్చి చెప్పారు. అంత వరకూ బాగానే ఉంది కానీ… ఎప్పుడో ఏడాదిన్నర కిందటే… ఎన్నికల సన్నాహాలు ప్రారంభించి.. కనీసం తెలంగాణతో పాటే అయినా ఎన్నికలకు వెళ్లాలని అన్నీ రెడీ చేసుకుని ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గినట్లు అనే గుసగుసలు వైసీపీలోనే వినిపిస్తున్నాయి.
గడప గడపకూ మన ప్రభుత్వం ఎన్నికల ప్రచారమేనని వైసీపీ నేతలకూ తెలుసు. చేసింది చెప్పుకుని ఎన్నికలకు వెళదామని ఉబలాటపడ్డారు. అయితే ఆ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అప్పటి వరకూ ఉందనుకున్న గ్రాఫ్.. మెల్లగా పాతాళంలోకి పడిపోవడం ప్రారంభించింది. అనేక సమస్యలు చుట్టుముట్టడం.. టీడీపీ నేతలు కూడా వ్యూహాత్మకంగా మహానాడులో మినీ మేనిఫెస్టో పెట్టడంతో… వచ్చే ఎన్నికలకు తాము ఎలా వెళ్లాలన్నదానిపై వైసీపీ క్లూ లెస్ గా మారిపోయింది.
ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఒక్క అభివృద్ధి పని లేదు.. రోడ్లు లేవు. పన్నులుబాదేశారు. దీంతో ఎన్నికలు ఎంత ముందు పెట్టినా కర్రు కాల్చి వాత పెడతారని రిపోర్టులువచ్చాయి. దీంతో అధికారాన్ని ముందు వదులుకోవడం ఎందుకని జగన్ ముందస్తు ఆలోచనలపై పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గారని వైసీపీ నేతలు కూడా ఓ అభిప్రాయానికి వచ్చారు.
పార్లమెంట్ తో పాటు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి ఇబ్బందికరమే. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా… ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. ప్రత్యేకంగా రాష్ట్ర ఎజెండాతో ఎన్నికలు జరిగేలా చూసుకుంటున్నారు. జగన్ కూడా అదే చేయాలనుకున్నారు. కానీ .. ధైర్యం చేయలేకపోతున్నారు.