కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి జయరాం కు జగన్ రెడ్డి టిక్కెట్ ఎగ్గొడుతున్నారు. ఈ విషయాన్ని పిలిచి మరీ చెప్పారు. అయితే జయరాం… జగన్ రెడ్డిని మొదటి నుంచి నమ్ముకోలేదు. ఆయన పలుకుబడి అంతా కర్ణాటక లో ఉంది. అక్కడి నుంచి వచ్చే సిఫార్సుల మేరకు జగన్ రెడ్డి ఇంత కాలం ఆయనకు టిక్కెట్లు, మంత్రి పదవులు కేటాయించారు. తీవ్ర ఆరోపణలు ఉన్నా మంత్రిగా కొనసాగించారు.
ఇప్పుడు కూడా ఆయన అదే పలుకుబడి ఉపయోగిస్తున్నారు. బళ్లారి నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన నాగేంద్ర ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. డీకే శివకుమార్ కు సన్నిహితుడు. ఆయన గుమ్మనూరు జయరాం దగ్గర బంధువు. దీంతో డీకే శివకుమార్ ద్వారా జగన్ రెడ్డిపై ఒత్తిడి చేయిస్తున్నారని చెబుతున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. అయితే గుమ్మనూరు జయరాంపై జగన్ కోపానికి ఓ కారణం ఉందని చెబుతున్నారు. అదే కర్ణాటక మంత్రి బి.శ్రీరాములు వ్యవహారం.
శ్రీరాములు సోదరి శాంత గతంలో బీజేపీ తరపున బళ్లారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు హిందూపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. అంతే కాదు.. . కర్నూలు నుంచి కూడా తన అనుచరుడ్ని వైసీపీ తరపున బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జగన్ వద్ద ఆయనకు అంత పలుకుబడి ఉంది. ఆయనే గుమ్మనూరు టిక్కెట్ ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారు.
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. గుమ్మనూరు జయరాం తన సోదరుడు నాగేంద్ర తరపున బళ్లారిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సమయంలో బి.శ్రీరాములపై వైసీపీ భాషను ప్రయోగించారు. అక్కడే సమస్య వచ్చింది. తనను బూతులు తిట్టిన జయరాంకు.. వైసీపీలో నీడ లేకుండా శ్రీరాములు చేస్తున్నారని అంటున్నారు. అందుకే టిక్కెట్ ఇవ్వకపోతే జయరాం కాంగ్రెస్ లో చేరి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని చెబుతున్నారు.