విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినాయక్తవఅసంతృప్తితో ఉన్నారు. పార్టీ పరాజయం పాలైన తర్వాత కూడా అధినేత తీసుకున్న కొన్ని నిర్ణయాలపట్ల ఆయన తనకు అవమానం జరిగిందని భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన ముగ్గురి ఎంపీలకు మూడు పదవులు ఒకేరోజు ప్రకటించకుండా వారం తర్వాత విప్ పదవి ప్రకటించడంపట్ల కేశినేని నాని తనకు అవమానం జరిగిందని.. ఆయన భావిస్తున్నారు. అందుకే.. తనకు పదవులు కాదని.. ఆత్మాభిమానం ముఖ్యమని చెబుతున్నారు. కేశినేని నానికి లోక్ సభలో విప్ పదవిని ఇస్తూ చంద్రబాబునాయుడు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సమావేశంలో పాల్గొన్న నానికి ఈ విషయం చెప్పగా ఆయన తిరస్కరించారు. ఆ తర్వాత నానిని విప్ పదవికి ఎంపిక చేసినట్టు ప్రకటన వెలువడింది. లోక్ సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ముగ్గురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇందులో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు ఉన్నారు. వీరి ముగ్గురికి మూడు పదవులు మొదటి రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనే అప్పగిస్తే ఇంత వివాదం వచ్చి ఉండేదికాదని పార్టీ వర్గాలంటున్నాయి.
దీనిపై కేశినేని నాని తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో స్పందించారు. తనకు విప్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే తనకంటే సమర్థుడైన మరోకర్ని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేశారు. అంత పెద్ద పదవి చేపట్టేందుకు తాను అనర్హుడినని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రజానీకం ఆశీస్సులు, ఆదరాభిమానాలు తనకు ఉండటం వల్లే మళ్లీ తనను ఎంపీగా ఎన్నుకున్నారని, విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడంలోనే ఎంతో ఆనందం, సంతృప్తి ఉందని నాని వ్యాఖ్యానించారు. విప్ పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నాని అందులో పేర్కొన్నారు. ఎంపీ నాని తన ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయి. దీంతో గల్లా జయదేవ్ మొదట.. కేశినేని నాతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
మరో వివాదం కూడా…కేశినేని నాని తనకు అవమానం జరిగినట్లు ఫీలవడానికి కారణమయింది. మంగళగిరిలో రాష్ట్ర పార్టీ కార్యాలయం పూర్తయ్యే వరకు విజయవాడలో పార్టీ తాత్కాలిక కార్యాలయాన్ని చూడాలని నానికి అధినేత చంద్రబాబు సూచించారు. నాని ఒక భవనాన్ని కూడా చూశారు. భవన యజమాని కూడా అంగీకరించారు. ఇదే విషయాన్ని మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో నాని చంద్రబాబుకు చెప్పారు. అయితే గొల్లపూడిలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని కొంత మంది చంద్రబాబుకు సలహా ఇచ్చారు. దానికే చంద్రబాబు ఓకే చేశారు. గొల్లపూడిలో ఒక చిన్న సందులో ఉన్న పార్టీ కార్యాలయానికి నేతలు ఎలా వస్తారని దేవినేని ఉమామహేశ్వరరావు సూచనల మేరకే పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ ప్రాంతానికి తరలించారని.. అక్కడే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఉంటే తనకు ఎందుకు చెప్పాలని ఎంపీ నాని.. తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాలతో తాను అవమానానికి గురయ్యానని కేశినేని నాని భావించి…అసంతృప్తి వ్యక్తం చేశారు.