హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మరో అద్భుతంగా నిలవనున్న కోకాపేట ట్రంపెట్ జంక్షన్ నిర్మాణం పూర్తి అయింది. కానీ అధికారికంగా రిబ్బన్ కట్ చేయకపోవడంతో నిరుపయోగంగా ఉంది. అంతా రెడీ అయిపోయినా వినియోగానికి అనుమతించకపోవడంతో ఆయా మార్గాల్లోని వాహనదారులకు.. నియోపొలిస్ అభివృద్ధికి సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఓఆర్ఆర్పై కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ ట్రంపెట్ ఆకారంలో ఇంటర్‌ఛేంజ్ రహదారిని నిర్మించారు. రెండు, మూడు నెలల నుంచి ఇదిగో ప్రారంభం.. అదిగో ప్రారంభం అంటున్నారు కానీ ముహుర్తం ఖరారు కావడం లేదు. నియోపొలిస్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్లను విస్తరించారు. కానీ ఈ రోడ్లకు ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ నిర్మించిన ట్రంపెట్ అందుబాటులోకి వచ్చినా ప్రారంభించకపోవడంతో చాలాసమస్యలు ఎదురవుతున్నాయి.
ట్రంపెట్ ప్రారంభిస్తే నియెపొలిస్ నుంచి హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. 1.27 కి.మీ పొడవుతో నాలుగు వరుసలతో ట్రంపెట్ జంక్షన్ పూర్తి చేశారు. నియోపొలిస్ లో ఎకరం వంద కోట్లు పలకడానికి మౌలిక సదుపాయాలు కూడా ఓ కారణం. నార్సింగి వద్ద రూ.15 కోట్లతో ఇంటర్‌చేంజ్‌ను, రూ.65 కోట్లతో ట్రంపెట్ రోడ్డును నిర్మించారు. ఈ ట్రంపెట్ జంక్షన్ నుంచి ఇటు పటాన్చెరు వైపు అటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు రెండు వైపులా రాకపోకలు సాగించడానికి అనువుగా ఉంటుంది.
అందుబాటులో ఉన్న ట్రంపెట్ ను ఉపయోగించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. నిర్వహణ సమస్యలతో పాటు అటు వైపుగా రాకపోకలు సాగించేవారికీ ఆర్థిక భారం పడుతుంది. అందుకే వెంటనే ప్రారంభించాలన్న విజ్ఞప్తులు ప్రజల నుంచి వస్తున్నాయి.