అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ తరవాత… హను రాఘవపూడి నుంచి వచ్చిన సినిమా ‘లై’. ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు.. అప్పట్లో తెగ ఆకర్షించాయి. నితిన్ ఫామ్‌లో ఉండడం, అర్జున్ లాంటి నటుడ్ని ప్రతినాయకుడిగా ఎంచుకోవడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాక్సాఫీసు దగ్గర మాత్రం ఈ సినిమా తుస్సుమంది. దర్శకుడిగా హను తన అతి తెలివితేటల్ని చూపించినందుకు తగిన ఫలితమే అనుభవించాడు. ట్విస్టుల పేరుతో.. ప్రేక్షకులకు తలనొప్పి తీసుకొచ్చిన సినిమా ఇది. అప్పట్లో `ప్రేక్షకులకు ఈ సినిమా చూడడం రాలేదు` అంటూ నితిన్ కాస్త రాంగ్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు.
ఇప్పుడు ఈ పరాజయంపై దర్శకుడు హను పెదవి విప్పాడు. అయితే ఇప్పటికీ ఈ సినిమాపై హనుకి ప్రేమ చావలేదు. రచయితగా తనకు పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రమిదని, దర్శకుడిగా తను విఫలమయ్యానని అంటున్నాడు. ”లై అంటే ఇప్పటికీ నాకు ఇష్టమే. స్క్కిప్టు పరంగా బాగానే రాసుకున్నా. ఆ సినిమాని తొందరగా తీయాల్సివచ్చింది. ఆ కంగారులో రాసుకున్న సినిమాని తెరపై చూపించలేకపోయాను. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది” అంటున్నాడు హను. అతి తెలివితేటలు చూపించడం వల్ల.. సినిమా ఆడలేదన్నది సినీ విమర్శకుల అభిప్రాయం. ఇదే విషయం.. హనుని అడిగితే.. ”ఈసారి ప్రేక్షకుల మైండ్ సెట్‌కి దగ్గరగా ఉండే సినిమానే తీశా. కట్టె కొట్టె తెచ్చె.. అంటూ సింపుల్ గా స్క్రీప్లే రాసుకున్నా. కథలో పెద్ద గందరగోళాలేం ఉండవు” అంటూ తేల్చేశాడు. ఈ సినిమా రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.