పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 2019 ఎన్నికలలో అనుకున్న దాని కంటే ఘోరమైన ఫలితాలను పొందుకుంది. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారు. కర్ణుడి చావుకి 6 కారణాలు అన్నట్లుగా జనసేన ఓటమికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ, ఎన్నికలకు ఏడాది ముందు పవన్ కళ్యాణ్ మీడియా మద్దతు లేకపోవడం కూడా దీనికి ఒక కారణం. అయితే గత నెల రోజులుగా పరిస్థితి మారుతున్నట్లు గా, జనసేన పార్టీకి మీడియా మద్దతు పెరుగుతున్నట్లు గా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
2019 ఎన్నికల్లో జనసేనకు గట్టిగా తగిలిన మీడియా దెబ్బ:
పవన్ కళ్యాణ్ 2014 లో పార్టీ పెట్టిన నాటి నుండి 2018లో తెలుగుదేశం పార్టీతో విడిపోయి, ఆ పార్టీ మీద నిప్పులు చెరిగే వరకు కూడా పవన్ కళ్యాణ్ కి మీడియా మద్దతు బాగానే ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీ నుండి దూరం అయిన మరుక్షణం నుండి టీవీ చానల్స్ లో పవన్ కళ్యాణ్ కు పూర్తిగా వ్యతిరేక కథనాలు రావడం మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్, వ్యతిరేక కథనాలు ప్రోత్సహించిన మీడియా మీద కూడా తీవ్రంగా విరుచుకు పడటంతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త కూడా ప్రసారం చేయడం చానల్స్ మానేశాయి. పవన్ కళ్యాణ్ విమర్శించిన చానల్స్ తో పాటు, ఎందుకనో గానీ మిగతా చానల్స్ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీ ని పక్కన పెట్టేశాయి. పవన్ కళ్యాణ్ అరకులో గిరిజనులతో పాటు రోజుల తరబడి అక్కడే మకాం వేసినా, మధ్యతరగతి హోటల్స్ కంటే కూడా చిన్న స్థాయి హోటల్స్ లో నేల మీద పడుకుంటూ పర్యటనలు చేసినా, అధికార పార్టీ లోపాలను ఎత్తి చూపినా, రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించడం కోసం అతి సామాన్యులను, సామాజిక కార్యకర్తలను, డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలలో పోటీ చేయించినా, వీటిలో ఏ ఒక్క దానికి కూడా మీడియాలో కనీస ప్రాధాన్యం దక్కలేదు. అసలు ఈ విషయాలన్నీ ప్రజలకు చేరను కూడా చేరలేదు. అన్ని మీడియా సంస్థలు కూడబలుక్కున్నట్లుగా ఇదే విధంగా చేయడంతో, ఒకానొక సమయంలో జనసేన అభిమానులకి తప్ప సామాన్య ప్రజలకు పార్టీ గురించిన ప్రాథమిక సమాచారం కూడా లేకపోవడంతో చాలా మంది ఆ పార్టీ ఉందన్న విషయం కూడా మర్చి పోయారు. ఇవన్నీ ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేశాయని చెప్పక తప్పదు.
గత నెల రోజులుగా మారిన మీడియా వైఖరి:
అయితే ఎన్నికల్లో ఓటమి పాలైనా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తన దుడుకుతనం ఏమాత్రం తగ్గించలేదు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వ్యవహారశైలి మీద, పాలన మీద, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కంటే కూడా బలంగా పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇసుక విషయంలో పవన్ కళ్యాణ్ రోడ్ల మీదకు వచ్చిన తర్వాత ఆయన విధించిన డెడ్‌లైన్‌ను లోపలే జగన్ ఇసుక పాలసీని తీసుకురావడం గమనార్హం. ఇంగ్లీష్ మీడియం మీద, రైతు సమస్యల మీద, ఇంకా జగన్ పాలన లోని అనేక అంశాల పైన పవన్ కళ్యాణ్ నిత్యం పోరాడుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ ఎంత పోరాటం చేసినప్పటికీ, మీడియా వాటిని ప్రసారం చేయకపోతే ఇదంతా ప్రజలకు తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం అగ్ర చానల్స్ తో సహా దాదాపు అన్ని చానల్స్ పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి తగిన రీతిలో కవరేజ్ ఇస్తున్నాయి. దీనికి ఒకొక్కరు ఒకొక్క విధంగా విశ్లేషణ చెబుతున్నారు.
ఇప్పుడు మీడియా మద్దతు పెరగడానికి కారణాలివేనా?
వీటిలో మొదటిది- పవన్‌కళ్యాణ్ ని ప్రభుత్వ వ్యతిరేకత పెంచే క్యాటలిస్టు గా మీడియా సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి అన్నది. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన కొత్త లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు అన్ని కూడా వైయస్ పై చిరంజీవి చేసే విమర్శలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది అనుకున్న తర్వాత, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, చిరంజీవి మీద, ప్రజారాజ్యం మీద వ్యతిరేక కథనాలకు ప్రాధాన్యత నిచ్చి తెలుగుదేశం పార్టీని పైకి లేపడానికి ప్రయత్నించాయి అని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అన్నది ఆ విశ్లేషణ.
ఇక రెండవది, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత సమీకరణాలు మారాయని, జనసేన బిజెపి మధ్య కుదిరిన అవగాహన మేరకే, ఆ తర్వాత వచ్చిన కొన్ని సూచనల మేరకే మీడియా సంస్థలు పవన్ కళ్యాణ్ వార్తలకు ప్రాధాన్యతనిస్తున్నాయి అన్నది రెండో విశ్లేషణ.
మొత్తం మీద:
ఏది ఏమైనా జనసేన పార్టీకి ప్రస్తుతం పెరిగిన మీడియా మద్దతు ఇదేలాగా చివరికంటా కొనసాగుతుందన్న నమ్మకం చాలామంది జనసేన అభిమానుల లోనే లేకపోవడం గమనార్హం. బిజెపి తోనో లేదంటే తెలుగుదేశం తోనో కలిసి ఉంటే మాత్రమే వచ్చే మద్దతు ఎంతకాలం ఉంటుంది అన్నది వారి ప్రశ్న. మరి ఈ సమస్యను అధిగమించడానికి జనసేన ఏ విధంగా ప్రయత్నిస్తుందో వేచి చూడాలి.
– జురాన్ (@CriticZuran)