నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల (ఛలో ఫేమ్) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కాల్సివుంది. దీనికి `భీష్మ` అనే పేరు పెట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చేసింది. స్క్రిప్టు కూడా సిద్ధంగానే ఉంది. కానీ ఇప్పటి వరకూ ఈ సినిమా పట్టాలెక్కలేదు. దానికి కారణం ఏమిటని ఆరాతీస్తే… పారితోషికం విషయంలో నితిన్‌కీ, సితార ఎంటర్టైన్మెంట్స్కీ మధ్య ఇంకా రాజీ కుదర్లేదని తెలుస్తోంది.
నితిన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఛల్ మోహన రంగ, లై, శ్రీనివాస కల్యాణం.. ఇలా మూడూ డిజాస్టర్లే. కాకపోతే… సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా చేస్తానని `లై`కి ముందే ఒప్పుకున్నాడు నితిన్. పారితోషికం ఎంతన్న విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చేసింది. కానీ వరుస ఫ్లాపుల నేపథ్యంలో నితిన్ పారితోషికం తగ్గించుకుంటాడేమో అని సితార నిర్మాతలు భావించారు. కానీ నితిన్ మాత్రం పారితోషికం తగ్గించుకోవడానికి ససేమీరా అంటున్నాడట. అప్పట్లో ఫిక్సయిన పారితోషికం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడట. సితార వాళ్లు మాత్రం పారితోషికం తగ్గించుకోవాల్సిందే అని పట్టుపడుతున్నట్టు టాక్. అందుకే.. ఈ సినిమా ఇప్పటి వరకూ సెట్స్‌పైకి వెళ్లట్లేదని సమాచారం. నితిన్ – సితార ఇద్దరూ ఓ అంకెకి పిక్సయితే తప్ప.. ఈ సినిమా పట్టాలెక్కదు. మరి అదెప్పుడు జరుగుతుందో…??