చాలా కాలంగా తెలుగు సినిమా కళ తప్పింది. సరైన సినిమా లేక, భారీ వసూళ్లు చూడక బోసిబోయింది. మరీ ముఖ్యంగా మాస్ సినిమాకు కరువొచ్చింది. పెద్ద హీరోలు సైతం కొత్త దారులు వెదుక్కొంటూ వెళ్లడంతో మాస్, కమర్షియల్ సినిమాల రాక బాగా తగ్గిపోయింది. ఓ మాస్ సినిమా థియేటర్లకు వస్తే ఆ పూనకాలు ఎలా ఉంటాయో, ఆ సినిమాకు హిట్ టాక్ వస్తే – ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి ‘దేవర’ చాటి చెప్పింది. చాలా కాలం తరవాత మాస్ ఆకలి తీర్చిన సినిమాగా ‘దేవర’ నిలిచిపోతుంది.
‘దేవర’ క్రేజ్ చాప కింద నీరులా విస్తరించుకొంటూ పోయింది. ఎప్పుడు ఆ అంచనాలు ఆకాశానికి తాకాయో అర్థం కాలేదు. ఎన్టీఆర్ సోలో హీరోగా ఆరేళ్ల తరవాత చేసిన సినిమా ఇది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆశగా, ఆత్రుతగా ఎదురు చూస్తారని తెలుసు. కానీ.. ఇంత క్రేజ్ మాత్రం ఊహించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పోటెత్తిన ఫ్యాన్స్ ని చూశాక కానీ, దేవరకు ఉన్న క్రేజ్ టాలీవుడ్ కు అర్థం కాలేదు. అభిమానుల తాకిడిని అదుపు చేయలేక, ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని రద్దు చేయడం ఏమిటి? చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? ‘దేవర’ కోసం మాస్ ఎంతలా ఎదురు చూస్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనం.
27న అర్థరాత్రి ప్రీమియర్స్ ది మరో చరిత్ర. టికెట్ రేట్ రూ.1000 అన్నా ఎవరూ తగ్గలేదు. హైదరాబాద్ లో ఏకంగా 40 థియేటర్లలో ప్రీమియర్ షోలకు అనుమతి వచ్చింది. ఆ 40 షోలు కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. ఉదయం 4.30 షోకీ టికెట్లు దొరకలేదు. తొలి మూడు రోజుల్లోనూ ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే. ఓ మాస్ సినిమా జనాలకు పట్టేస్తే ఆ ఊపు ఎలా ఉంటుందో చెప్పడానికి `దేవర`కు మించిన సాక్ష్యం దొరకదు. అలాగని ఈ సినిమాపై పూర్తిగా పాజిటీవ్ రివ్యూలే వచ్చాయా అంటే అదీ లేదు. ఈ సినిమాపై డివైడ్ టాక్ నడిచింది. ఆశించినంత గొప్పగా లేదని చాలామంది పెదవి విరిచారు. అయినా ఆప్రభంజనం తగ్గలేదు. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్, ఆయుధ పూజ పాటలో తన పెర్ఫార్మ్సెన్స్, ఫైట్ సీక్వెన్స్…ఇలా ప్రతీదీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ‘చుట్టమల్లే’ పాటకైతే.. థియేటర్లలో ఒక్కరూ కూర్చోలేదు. పైగా.. పాట పాడుతూ… కోరస్ కూడా అందించారు. ఈ పాటని థియేటర్లో ఎంజాయ్ చేయడానికి మళ్లీ మళ్లీ ఈ సినిమా చూస్తున్నవాళ్లు ఉన్నారు.
మొత్తానికి మాస్ జాతర ఎలా ఉంటుందో `దేవర` చెప్పేసింది. మాస్ కథలకున్న గిరాకీ మరోసారి తెలుగు చిత్రసీమకు తెలిసొచ్చింది. ‘దేవర’ ప్రభావంతో కొంతకాలం స్టార్ హీరోలు మాస్ కథల్ని వెదుక్కొంటూ వెళ్తారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు.