ప్రభాస్‌ని వెండి తెరపై చూసుకుని రెండేళ్లు దాటేసింది. ఈ రెండేళ్లలో మరో అగ్ర కథానాయకుడు ఎవరైనా సరే – కనీసం మూడు సినిమాలు రంగంలోకి దింపేవాడు. కానీ.. ప్రభాస్ మాత్రం కేవలం `సాహో`కి మాత్రమే పరిమితమైపోయాడు. ఆ సినిమా కూడా విడుదల కాలేదు. మరో సినిమా `జాన్` పోగ్రెస్ ఏమిటో ఇంత వరకూ తెలీదు. ఈ యేడాది వేసవిలో `సాహో` వస్తుందని ఆశించారంతా. కానీ అది కాస్త ఆగస్టు 15కు వెళ్లిపోయింది. 300 కోట్ల సినిమా ఇది. మూడు భాషల్లో తీస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. దాంతో.. ఆ మాత్రం సమయం పడుతుందిలే అని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పెద్ద మనసు చేసుకున్నారు. ఈసినిమాకి సంబంధించిన అప్ డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడడం, దర్శక నిర్మాతలు హ్యాండ్ ఇవ్వడం.. అలవాటైపోయింది.
ప్రమోషన్ పరంగానూ ప్రభాస్ ఫ్యాన్స్‌ని సాహో ఏమాత్రం అలరించలేకపోయింది. షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో రెండు వర్కింగ్ టీజర్లు విడుదల చేశారు. టీజర్ ఒకటొచ్చింది. పాట కూడా విడుదల చేశారు. టీజర్‌తో సంతృప్తి వ్యక్తం చేసిన ప్రభాస్ ఫ్యాన్స్- పాట చూసి గోల పెట్టారు. ఇది హిందీ పాటలా ఉందంటూ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైపోయింది. ఇప్పుడు ఏకంగా సినిమాని 15 రోజులు పాటు వాయిదా వేశారు. వీఎఫ్ ఎక్స్ పనులు ఇంకా అవ్వలేదని అందుకే వాయిదా వేయాల్సివచ్చిందని చిత్రబృందం చెబుతోంది. వీ ఎఫ్ ఎక్స్‌కి ఎక్కువ సమయం కేటాయించాలని సాహో బృందానికి ముందే తెలుసు. దానికి తగ్గట్టే ప్రిపేర్ అయ్యింది కూడా. ఈరోజుతో సాహో షూటింగ్ పూర్తయ్యింది. విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఈలోగా… వీఎఫ్ఎక్స్ పనులన్నీ చక్కబెట్టుకోవొచ్చు. ఆగస్టు 15నాటికి కూడా సాహో సిద్ధంకాలేదంటే… ఇంకా సాహో పనులు ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
సాహోని 300 కోట్ల రూపాయలతో తీస్తున్నారు. ఇలాంటి సినిమాలకు భారీ ఎత్తున మార్కెటింగ్ చేయాలి. తెలుగులో ప్రభాస్ సినిమాకి తిరుగుండకపోవొచ్చు. బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ సినిమాని ప్రమోట్ చేసుకోవాల్సిందే. అక్కడ ప్రమోషన్లకు ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. సినిమాని వీలైనంత త్వరగా రెడీ చేసుకుంటే తప్ప, ప్రమోషన్లకు సరిపడ సమయం కేటాయించడం వీలు కాదు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. తీసిన సినిమానే మళ్లీ తీసుకుంటూ, చేసిన పనే మళ్లీ చేసుకుంటూ వెళ్తున్నారు. దాంతో అనవసరమైన కాలయాపన జరుగుతోంది. సాహో ప్రధాన సమస్య అదే. అందుకే ఇప్పుడు ఈ సినిమా ఆలస్యమైంది. భారీ చిత్రాలు విడుదల ఆలస్యం అవ్వడం మామూలే. కానీ అలా వాయిదా పడుతూ వచ్చిన సినిమాలేవీ సరిగా ఆడలేదు. సాహో కూడాకి కూడా ప్రమాదం పొంచి ఉంది.