ప్రకాష్ రాజ్ కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మామూలుగా ఆయనకు ఇష్టం లేకపోతే.. సినిమాలో తనది కీ రోల్ అయినా పబ్లిసిటీకి ముందుకు రారు. కానీ వకీల్ సాబ్ విషయంలో పరిస్థితి వేరు. ప్రోమోలలో … పోస్టర్లలో ఆయనకు పెద్దగా ఫోకస్ లేకపోయినా… మీడియా ఇంటర్యూల్లో మాత్రం ఆయన సినిమాను తెగ పొగిడేస్తున్నారు. ఆయన ఇంటర్యూల్లో సినిమా కంటే ఎక్కువగా.. పవన్ కల్యాణ్.. మెగా పొగడ్తలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రకాష్ రాజ్ తీరుపై ఇండస్ట్రీలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకలా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఆ చర్చల్లో అసలు విషయం బయటకు వస్తోంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. మా పదవి కాలం త్వరలో పూర్తి కానుంది. ఈ సారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ప్రకాష్ రాజ్ భావిస్తున్నారు. అయితే ఆయన ఒంటరిగా పోటీ చేస్తే… సరిపోదు.. మెగా కాంపౌండ్ మద్దతు ఉన్న వారికే ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయి. అంతకు ముందు శివాజీ రాజా అయినా.. తర్వాత నరేష్ అయినా.. మెగా కాంపౌండ్ మద్దతుతో విజయం సాధించిన వాళ్లే. ఇప్పుడు కూడా..వారు చెప్పిన వారే గెలవడానికి అవకాశం ఉంది. శివాజీ రాజా కానీ.. నరేష్ కానీ ఈ సారి బరిలో నిలబడే అవకాశాలు లేవు. ఉన్నా.. వారికి మెగా క్యాంప్ నుంచి మద్దతు రాదు. ఎందుకంటే.. గెలిచిన తర్వాత ఇద్దరూ మెగా ఆదేశాలను ధిక్కరించి.. వివాదాలు తెచ్చి పెట్టారు.
ఈ సారి వివాదాలకు చాన్స్ లేకుండా.. మా అధ్యక్ష పదవి ఎన్నికలు జరగాలని.. ఎన్నికయ్యే వారు కూడా మాని గొడవల్లోకి నెట్టకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. చిరంజీవి కూడా అదే కోరుకుంటారు. అందులో సందేహం ఉండదు. దానికి ఏకగ్రీవమే మార్గం. చిరంజీవి సంకల్పిస్తే ఏకగ్రీవం అయ్యే చాన్స్ ఉంది. పోటీ పెట్టినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మెగా క్యాంప్ మద్దతుతో ప్రకాష్ రాజ్..మా అధ్యక్షుడు అవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పొగడ్తలు ప్రారంభించారని అంటున్నారు. నిజానికి ప్రకాష్ రాజ్‌కు… పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది. ఆయన కేసీఆర్‌కు ఆత్మీయుడు. సన్నిహితుడు. ప్రకాష్ రాజ్ కావాలనుకుంటే మా అధ్యక్షుడు అవడం.. ఈజీనే. అయితే.. వివాదాల్లేకుండా ఎన్నిక జరుగుతుంది..కానీ ఆ తర్వాత వివాదాలు రాకుండా ఉంటాయని మాత్రం గ్యారంటీ ఇవ్వలేమని సినీ పెద్దలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గురించి వారందిరకీ తెలుసు మరి..!