`మా` ప్రహసనం ముగిసింది. ప్రకాష్ రాజ్ పై విష్ణు భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఇద్దరి మధ్యా హోరా హోరీ పోరు తప్పదని, ఎవరు గెలిచినా ఆధిక్యం 50 ఓట్లకు మించి ఉండదని ముందు నుంచీ అనుకుంటూనే ఉన్నారు. కానీ.. ఆధిక్యంలో చాలా స్పష్టమైన తేడా కనిపించింది.
నిజానికి `మా` ఎన్నికలకు ఇది వరకూ ఎప్పుడూ ఇంత ప్రాముఖ్యత లేదు. అయితే ఎప్పుడూ లేనంతగా మీడియా దృష్టి… ఈ ఎన్నికలపై పడింది. ప్రకాష్ రాజ్ పోటీలో నిలవడం, ఆ తరవాత విష్ణు బరిలోకి దిగడం, వీరిద్దరితో పాటు మరికొంత మంది అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడంతో పోటీ రసవ్తరంగా మారింది. అయితే చివరి వరకూ బరిలో విష్ణు, ప్రకాష్ రాజ్ లే నిలిచారు. ప్రకాష్ రాజ్ వెనుక మెగా కాంపౌండ్ ఉందన్న వార్తలు రావడంతో, ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తాడనిపించింది.
అయితే విష్ణు.. ప్రచారవ్యూహం విభిన్నంగా సాగింది. `మా భవనం నేనే కడతా` అంటూ.. విష్ణు ప్రకటించి, అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్నాడు. `మా` భవనం అనేది ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తున్న అంశం. విష్ణు ఒక్క మాటతో… దాన్ని తేల్చేశాడు. అక్కడ విష్ణు మార్కులు కొట్టేశాడు. ఆ తరవాత ప్రచారంలో జోరు పెంచాడు. ఎప్పుడూ `మా`లో ఓట్లు వేయని వాళ్లందరినీ – సమీకరించి, ఎక్కడెక్కడ ఉన్నా, వాళ్లందరూ హైదరాబాద్ వచ్చేలా చేశాడు. విందు, వినోదాలను ఏర్పాటు చేసే విషయంలోనూ ప్రకాష్ రాజ్ కంటే… ముందే ఉన్నాడు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. పోస్టల్ బ్యాలెట్ కావాలనుకున్నవాళ్లందరి తరపున, తనే రిటర్నింగ్ అధికారికి ఓ లేఖ రాసి, వాళ్లందరి ఫీజూ తానే కట్టేసి, ఓ రకంగా ఆ ఓట్లన్నీ తనకే పడేలా చూసుకున్నాడు.
విష్ణు విజయంలో నరేష్ ది కీలక పాత్ర. అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం… ఈ ఎన్నికలలో విష్ణుకి బాగా ఉపయోగపడింది. `ఈ ఎన్నికలలో నాది శ్రీకృష్ణ పాత్ర` అని చెప్పి, విష్ణు వెంటే ఉండి.. తనని గెలిపించుకున్నాడు. నరేష్‌కి `మా`లో బలం ఉంది.కనీసం 150 సభ్యుల మద్దతు తనకుంది. తాను ఎవరికి ఓట్లు వేయమని చెబితే, వాళ్లంతా అతనికే వేస్తారు. ఆ రకంగా… విష్ణు విజయంలో నరేష్ పాత్ర కీలకంగా మారిపోయింది.
ప్రకాష్ రాజ్ వెనుక మెగా కాంపౌండ్ ఉన్నా, వాళ్లు చేసిందేం లేదు. `ప్రకాష్‌రాజ్ కి ఓటేయండి` అని చిరంజీవి ఎప్పుడూ చెప్పలేదు. ప్రకాష్ రాజ్ ని గెలిపించే బాధ్యత నాగబాబు తీసుకున్నా, నాగబాబు చేసిన వ్యాఖ్యలు, వదిలిన వీడియో బైట్లు ప్రకాష్ రాజ్ కి మేలు చేయకపోగా, మైనస్ గా మారాయి. ముఖ్యంగా కోట శ్రీనివాసరావుపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓరకంగా… అదంతా నెగిటీవ్ సెన్స్ తీసుకొచ్చాయి. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని, పెద్దలంటే గౌరవం లేదని, క్రమశిక్షణ లేదని.. ఇలా రకరకాలుగా ప్రచారం చేసి, ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం కూడా.. విష్ణు ప్యానల్ కి కలిసొచ్చింది. అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ ఓడిపోయినా, తన ప్యానల్ లో… ఏకంగా 11 మంది సభ్యులు గెలిచారంటే క్రాస్ ఓటింగ్, ప్రకాష్ రాజ్ పవ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.