రాహుల్ గాంధీ వరంగల్ రావాలనుకున్నారు. కానీ రాలేదు. ఆ విషయం మాత్రం బయటకు వచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతలు హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ రాలేదని ప్రచారం చేయడం ప్రారంభించారు. తెలంగాణ సత్తా చూపిస్తామని.. రాహుల్ చెబితేనే కాంగ్రెస్ కు ఓట్లేశారని అందుకే ఆయననే అడుగుతారని అంటున్నారు. అసలు రాహుల్ గాందీ ఎందుకు తెలంగాణకు రావాలనుకున్నారో మాత్రం క్లారిటీ లేదు.
సాధారణంగా రాహుల్ పర్యటన అంటే.. చాలా రోజుల క్రిందటే డిసైడ్ అవుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. అయితే రాహుల్ గాంధీ వరంగల్ వస్తున్నట్లుగా మంగళవారం ఉదయమే మీడియాకు లీక్ అయింది. ఆయన నేరుగా శంషాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తారని అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకుని తర్వాత రైల్లో చెన్నై వెళ్తారని సమాచారం ఇచ్చారు. గంటకే రాహుల్ తన పర్యటన రద్దు చేసుకున్నారని సమాచారం ఇచ్చారు. రాహుల్ వరంగల్ కు వస్తారని ఇక్కడ ముఖ్యమంత్రికి కూడా సమాచారం లేదు. అందుకే రేవంత్ షెడ్యూల్ లో ఆ రోజు వరంగల్ టూర్ లేదు.
అసలు వచ్చే విషయమే తెలియదు కానీ రద్దయిన విషయానికి మాత్రం మంచి ప్రచారం జరిగింది. అసలు ఏ కార్యక్రమంలో పాల్గొంటారో కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. ఓ ప్రైవేటు కార్యక్రమం అని అనుకున్నారు కానీ అదేమిటో చెప్పలేదు కానీ.. బీఆర్ఎస్ మాత్రం.. ఆయన ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక పర్యటన రద్దు చేసుకున్నారని..తఢాకా చూపించామని ప్రచార చేసుకుంటోంది. దీనికి కాంగ్రెస్ నేతలు ఇంకా కౌంటర్ ఇవ్వలేదు.