సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆయన్ని నామినేట్ చేశారు. అయితే, గొగోయ్ నియామకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఏంటంటే… సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల నుంచి తప్పుకున్న కొద్దిరోజుల్లోనే ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఎలా వచ్చిందీ అని! దీని వెనక క్విడ్ ప్రోకో ఉందంటూ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ, ఎం.ఐ.ఎంతోపాటు మరికొన్ని పార్టీల నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. వీటిపై గొగోయ్ కూడా స్పందించారు. రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు తీసుకున్న తరువాత తనపై వస్తున్న విమర్శలకు సమాధానాలు చెబుతా అన్నారు. రాజ్యసభకు వెళ్లేందుకు తాను ఎందుకు అంగీకరించానో అదీ వివరిస్తా అంటున్నారు.
రంజన్ లాంటి న్యాయ కోవిదుడిని రాజ్యసభకు నామినేట్ చేయడం మంచి పరిణామమే. కానీ, ఈయన విషయంలో ఎందుకీ విమర్శలు? ఎందుకంటే, సుప్రీం కోర్టు నుంచి రిటైర్ అయిన వెంటనే ఆయనకి ఈ పదవి దక్కడమే! పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల్ని, వెంటనే ఏదైనా పదవుల్లో నియమిస్తే… న్యాయవ్యవస్థ నిస్పాక్షితక మీద, స్వయం ప్రతిపత్తి మీద మరకపడ్డట్టే అని గతంలో న్యాయమూర్తి హోదాలో రంజన్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఆయనే ఆ విమర్శలకు కారణమౌతున్నారు. న్యాయమూర్తులకు ఇలా వెంటనే పదవులు ఇవ్వడం ద్వారా… వారి పనితీరుపై ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రభావానికి ఆస్కారం ఉంటుందనేది అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే ఆస్కారం ఉంది. రంజన్ విషయంలో ఇంత చర్చకు మరో కారణం.. ఆయన పదవీ విరమణ చేసే ముందే రాఫెల్ కేసులో ప్రధానమంత్రికి క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు చెప్పారు, అయోధ్య అంశంలో ఆయనే తీర్పు ఇచ్చారు, ఆర్టికల్ 370 రాజ్యాంగబద్ధతను ఆయన ప్రశ్నించకపోవడం… ఇలాంటి విషయాల్లో ఆయన కీలకంగా నిలుస్తూ వచ్చారు. దీంతో, బాధ్యతల నుంచి తప్పుకున్న వెంటనే ప్రభుత్వ పదవి అనేసరికి వివిధ విమర్శలకు దారితీస్తోంది.
గతంలో పదవులు చేపట్టిన మాజీ జడ్జీలు లేరా…. అంటే ఉన్నారు. కానీ, న్యాయ వ్యవస్థకు సంబంధించిన కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నాక, కనీసం ఐదేళ్లపాటు ఏ పదవిలోనూ కొనసాగకుండా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉంది. కాబట్టి, గొగోయ్ నియామకంపై విమర్శలు వస్తున్నాయి. మరి, ఈ విమర్శలపై రంజన్ గొగోయ్ వివరణ ఎలా ఉంటుందో చూడాలి.